రాయల్ పోస్ట్ న్యూస్ ఆలేరు జులై 19/ : ఆలేరు పట్టణంలో గిరిజన తండాలకు చెందిన మహిళలు, చిరు వ్యాపారస్తులు సంప్రదాయ పద్ధతిలో జొన్న రొట్టెలు తయారు చేసి విక్రయిస్తున్న సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు స్వయంగా అక్కడ ఆగి వారి వద్ద నుంచి జొన్న రొట్టెలను కొనుగోలు చేశారు.

ఈ సందర్భంగా గిరిజన మహిళలతో ఆప్యాయంగా మాట్లాడిన ఎమ్మెల్యే వారి కుటుంబ పరిస్థితులు, వ్యాపారం సాగుతున్న తీరు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సంప్రదాయ ఆహార పదార్థాలకు ప్రజల్లో మంచి ఆదరణ పెరుగుతోందని, జొన్న రొట్టెలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రజలు మరింత ప్రోత్సహించాలని సూచించారు.
గిరిజన మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబాలను పోషించడం అభినందనీయమని పేర్కొన్న బీర్ల అయిలయ్య గారు, చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అన్నారు. గిరిజనులు, పేద చిరు వ్యాపారస్తుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, తమకు అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
స్థానికులు కూడా ఎమ్మెల్యే చూపిన ఆప్యాయతను అభినందిస్తూ, గిరిజన చిరు వ్యాపారుల పట్ల చూపిన ప్రోత్సాహం వారికి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారికి కృతజ్ఞతలు తెలిపారు.