బీబీనగర్ రాయల్ పోస్ట్ న్యూస్ ఆగస్ట్ 21/

వయోవృద్ధులు సమాజానికి అందించిన సేవలు అమోఘమైనవని, వారి ఆరోగ్యం, సంక్షేమం మరియు చట్టపరమైన హక్కులపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవిలత తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు… బీబీనగర్‌లోని వయోవృద్ధుల సంక్షేమ ఆశ్రయ భవనంలో ‘ప్రపంచ వయో వృద్ధుల సంక్షేమ దినోత్సవం’ పురస్కరించుకుని న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాధవిలత మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం ఆగస్టు 21న ప్రపంచ వయోవృద్ధుల సంక్షేమ దినోత్సవాన్ని జరుపుకుంటామని గుర్తుచేశారు. వయోవృద్ధుల రక్షణ కోసం ఉన్న చట్టాలు, వీలునామా, గిఫ్ట్ డీడ్, భరణం (మెయింటెనెన్స్) మరియు స్థిర ఆస్తుల పంపకం వంటి అంశాలపై ఆశ్రమవాసులకు సమగ్రంగా వివరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఆశ్రయ భవన అధ్యక్షులు కె. సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షులు ఆగమయ్య గౌడ్, జనరల్ సెక్రటరీ లింగారెడ్డి, కార్యదర్శి ధర్మయ్య మరియు రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు డి. బాలాజి, కె. చంద్రశేఖర్ మాట్లాడుతూ… వృద్ధుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఆశ్రమంలోని వృద్ధులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నివాసులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.