పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
– ఈ నెల 29 నుంచి 31 వరకు సీపీఐ(ఎం) పాదయాత్ర
– రౌండ్‌టేబుల్ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు మామిడాల భిక్షపతి, బస్వాపూర్ ప్రాజెక్టు భూనిర్వాసితుల నాయకులు కాలభైరవ
రాయల్ పోస్ట్ న్యూస్ ఆగస్ట్ 18 భువనగిరి/: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. ఈ నెల 29,30,31 తేదీల్లో భువనగిరి పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ తెలిపారు. మంగళవారం భువనగిరిలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. జిల్లాలో దాదాపు 20 ఏళ్లుగా పలు సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు చేపట్టినప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారని, ఆ తర్వాత సమస్యలను మళ్లీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. బస్వాపురం ప్రాజెక్టు పూర్తి చేయాలి అని బస్వాపురం ప్రాజెక్టు దాదాపు 90 శాతం పూర్తయిందని, మిగిలిన పనులు పూర్తి చేస్తే రైతులకు నీరు అందించే అవకాశం ఉందని జహంగీర్ తెలిపారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించేందుకు సుమారు రూ.420 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారని అన్నారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకుండా రిజర్వాయర్‌లో నీటిని నింపితే సమీప గ్రామాలు, తండాలు మునిగిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.గంధమల్ల, చర్లగూడపై శ్రద్ధ చూపాలి అని వారు డిమాండ్ చేశారు. చర్లగూడ ప్రాజెక్టు సుమారు 12 టీఎంసీలు, గంధమల్ల ప్రాజెక్టు 1.4 టీఎంసీల సామర్థ్యంతో ఉన్నాయని తెలిపారు. గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగి ఏడాది దాటినా పనుల్లో ఆశించిన పురోగతి లేదని విమర్శించారు.
శివన్నగూడెం ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.6,200 కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.1,500 కోట్ల మేర పనులు జరిగినట్లు తెలిపారు. నిధులు సరిపోక పనులు నెమ్మదిగా సాగుతున్నాయని అన్నారు. చౌటుప్పల్, నారాయణపురం ప్రాంతాలకు నీరు అందించే ప్రతిపాదనలను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని కోరారు. కాల్వల పరిస్థితి కూడా దయనీయం
ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి, బునాదిగాని కాల్వల రెండో దశ పనులు నిధుల కొరతతో నిలిచిపోయాయని జహంగీర్ తెలిపారు. ఆలేరు ప్రాంతంలో కాల్వలు తవ్వి, లైనింగ్ చేసినా దాదాపు పదేళ్లుగా నీరు అందడం లేదన్నారు. బృందావన్ కాల్వలో చెత్త పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడ్డాయని, ఆసిఫ్‌నగర్ కాల్వ నిర్వహణ కూడా సరిగా లేదని అన్నారు. మూసీ ప్రక్షాళనతో నీటి సమస్యకు పరిష్కారం
మూసీ ప్రక్షాళనను కేవలం రోడ్ల విస్తరణ, పర్యాటక అభివృద్ధికే పరిమితం చేయకుండా సాగు, తాగునీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సీపీఐ(ఎం) నాయకులు కోరారు. గోదావరి జలాలను మూసీతో అనుసంధానం చేసే అవకాశం, రిజర్వాయర్లు, కాల్వలకు నీరు అందించే ప్రణాళికను ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి బాపూఘాట్ వరకు మూసీ ప్రక్షాళన పనులకు నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రాంతాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. షామీర్‌పేట రిజర్వాయర్‌ను కూడా గతంలో ప్రతిపాదించిన విధంగా వినియోగించి ఈ ప్రాంతానికి సాగునీరు అందించే అవకాశాలను పరిశీలించాలని అన్నారు. 29 నుంచి పాదయాత్ర పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం కదిలేలా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని సీపీఐ(ఎం) నిర్ణయించింది. ఈ నెల 29, 30, 31 తేదీల్లో భువనగిరిలో పాదయాత్ర నిర్వహించి, అనంతరం ఇందిరాపార్క్ వద్ద బహిరంగ ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు.
పాదయాత్రను మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాకు జాన్ వెస్లీ, జూలకంటి రంగారెడ్డి తదితరులు హాజరవుతారని చెప్పారు.
పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి ఉద్యమించాలని జహంగీర్ పిలుపునిచ్చారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాదయాత్ర, ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.సాగు, తాగునీటి కోసం ఐక్య ఉద్యమాలు అవసరం అని వారు అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకుడు మామిడాల బిక్షపతి మాట్లాడుతూ 1987 నుంచి నీటి కోసం వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు అనేక ఉద్యమాలు నిర్వహించాయని గుర్తు చేశారు. అప్పటి ఉద్యమాల ఫలితంగానే దేవాదుల ప్రాజెక్టు ప్రారంభమైందన్నారు. దేవాదుల ప్రాజెక్టును తపాస్‌పల్లి నుంచి షామీర్‌పేట వరకు పూర్తి చేసి ఉంటే భువనగిరితో పాటు పలు జిల్లాలకు సాగు, తాగునీటి ప్రయోజనం కలిగేదని అన్నారు.
గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల విషయంలో ప్రాంతానికి తగిన న్యాయం చేయలేదని విమర్శించారు. నేటికీ నీటి కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరమన్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే రాజకీయ పార్టీలు ప్రజలను ఓటర్లుగానే చూస్తున్నాయని, వారి అసలు సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం వర్షాల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని, రైతులు పంటల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. భవిష్యత్తులో కరువు పరిస్థితులు రాకుండా సాగునీరు, తాగునీటి సమస్యలపై అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు కలిసి బలమైన ఉద్యమం చేపట్టాలని కోరారు. పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం సీపీఎం చేపట్టనున్న ఉద్యమానికి సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ, ఏఐకేఎంఎస్ మద్దతు ఇస్తాయని ప్రకటించారు. బస్వాపురం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి బస్వాపురం ప్రాజెక్టు నిర్వాసితులు. కాలభైరవ మాట్లాడుతూ.
పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బస్వాపురం ప్రాజెక్టు కారణంగా భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రాజెక్టు బాధితులు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పరిధిలో మొత్తం 4,291 ఎకరాల భూములు ప్రభావితమవుతున్నాయని తెలిపారు. బి.ఎన్.తిమ్మాపురం, చౌక్లతండా, లప్పనాయక్‌తండా గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయని పేర్కొన్నారు. తాము 16 ఏళ్లుగా పరిహారం, పునరావాసం కోసం పోరాడుతున్నామని నిర్వాసితుల పక్షాన తెలిపారు. బి.ఎన్.తిమ్మాపురంలో 1,761 ఎకరాలకు గాను 1,400 ఎకరాలకే పరిహారం అందిందని, ఇంకా సుమారు రూ.140 కోట్లు బకాయి ఉన్నాయని చెప్పారు. కబ్జాలో ఉన్న భూములకు కూడా పరిహారం ఇస్తామని గతంలో అధికారులు హామీ ఇచ్చారని, వాటికి సంబంధించిన బకాయిలు కలిపితే సుమారు రూ.200 కోట్ల వరకు ఉన్నాయని తెలిపారు.
2016–17లో మార్కెట్ ధర ఎకరాకు రూ.25–30 లక్షలు ఉండగా, తమకు రూ.15 లక్షలే చెల్లించారని అన్నారు. 2019లో 18 ఏళ్లు నిండిన యువతకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికీ అమలు కాలేదని తెలిపారు. ఉపాధి కోసం గ్రామం విడిచి వెళ్లిన 79 కుటుంబాలకు కూడా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.
పరిహారం, పునరావాస చర్యలు పూర్తయ్యే వరకు ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లవద్దని డిమాండ్ చేశారు. సొంత ఊరు, ఇళ్లు, పాఠశాలలు, జ్ఞాపకాలను వదులుకోవడం బాధగా ఉన్నప్పటికీ లక్షల ఎకరాలకు నీరు అందుతుందనే ఉద్దేశంతో త్యాగానికి సిద్ధమయ్యామని తెలిపారు. పార్టీలకు అతీతంగా నిర్వాసితుల సమస్యలకు మద్దతు ఇవ్వాలని కోరారు. వీరితోపాటు పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు కల్లూరి మల్లేశం దాసరి పాండు బూరుగు కృష్ణారెడ్డి బీఎస్పీ నాయకులు బట్టు రామచంద్ర య్య రాచకొండ జనార్ధన్ కళ్లెపు అడువయ్య ఇక్కిరి సహదేవ్ గడ్డం నాగరాజు చిరబోయిన రాజయ్య సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మండల కార్యదర్శులు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

