ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న: బీసీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు
- భువనగిరి ఖిల్లా వద్ద పాపన్న 376వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
- విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రముఖులు
రాయల్ పోస్ట్ న్యూస్ ఆగస్ట్ 18/యాదాద్రి భువనగిరి
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బీసీ వర్గాలకే కాకుండా తెలంగాణ ప్రజలందరి ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ సలహాదారు వి. హనుమంతరావు కొనియాడారు. భువనగిరి పట్టణంలోని ఖిల్లా వద్ద గల సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వి. హనుమంతరావు మాట్లాడుతూ… స్వాతంత్ర్యానికి ముందే స్వయం పాలన సాధించి, రాజ్యం ఏలిన గొప్ప వీరుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు.
మున్సిపల్ చైర్మన్ శ్రీమతి తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ మాట్లాడుతూ… సర్వాయి పాపన్న బీసీ, గిరిజన, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన యోధుడని తెలిపారు. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి స్వయం పాలన సాధించిన మొట్టమొదటి తెలుగు వీరుడు ఆయన అని చెప్పారు. ఆయన త్యాగం, ధైర్యం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం బీసీ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, పాపన్న కలలు కన్న సమసమాజ స్థాపనకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మార్వో జగన్, సర్దార్ సర్వాయి పాపన్న ఉత్సవ కమిటీ అధ్యక్షులు పంజాల జైహింద్ గౌడ్, బాలరాజ్, కౌన్సిలర్లు కుక్కదువ్వు పద్మ సోమయ్య, తాహేర మజార్ పాషా (బబ్లు), పోలిశెట్టి అనిల్ కుమార్, తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


