రాయల్ పోస్ట్ న్యూస్ గజ్వేల్/ప్రజ్ఞాపూర్, 17 జూలై 2026 :

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజల ప్రాణాలతో వ్యాపారులు చెలగాటం ఆడుతున్నారు. పట్టణంలోని పలు టీ దుకాణాలు, హోటళ్లలో నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ జాలీలను విచ్చలవిడిగా వాడుతున్నారు. పొగలు గక్కే వేడి వేడి టీని ఈ ప్లాస్టిక్ జాలీల ద్వారా వడకట్టడం వల్ల ప్లాస్టిక్‌లోని ప్రమాదకర రసాయనాలు, మైక్రోప్లాస్టిక్స్ టీలో కరిగిపోతున్నాయి. దీనివల్ల ఆ టీని తాగే సాధారణ ప్రజలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తీవ్రమైన ఆరోగ్య సమస్యపై స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఫిర్యాదులు అందినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, కనీసం టీ దుకాణాల్లో తనిఖీలు కూడా చేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛత మరియు ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాల్సిన మున్సిపల్ యంత్రాంగం, ఇంత పెద్ద ముప్పు పొంచి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హోటళ్లు, టీ స్టాళ్లలో ప్లాస్టిక్ జాలీల స్థానంలో కేవలం స్టీల్ లేదా బట్టతో చేసిన వడపోత సాధనాలను మాత్రమే వాడేలా అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్, ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ప్లాస్టిక్ జాలీలు వాడుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.