గజ్వేల్, 15 జూలై 2026 రాయల్ పోస్ట్ న్యూస్ /సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ వరాహి దేవి అమ్మవారికి అత్యంత వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాస శుక్ల పక్ష బుధవారాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన పురోహితులు చాడ నంద బాల శర్మ ఆధ్వర్యంలో అమ్మవార్లను శోభాయమానంగా, సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో విశేష అర్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం పురోహితులు చాడ నంద బాల శర్మ మాట్లాడుతూ అత్యంత శక్తివంతమైన ఆషాఢ మాసంలో వారాహి దేవి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల గ్రహ, జాతక దోషాలు తొలగిపోతాయని తెలిపారు. వారాహి మాత అనుగ్రహంతో భక్తులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ మాసంలో అమ్మవారి ఆరాధనకు భక్తులు విశేష ప్రాధాన్యత ఇస్తారని వివరించారు. ఈ ప్రత్యేక పూజా మహోత్సవంలో గజ్వేల్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
