మర్కుక్, 09 జూలై 2026 రాయల్ పోస్ట్ న్యూస్ :

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గత కొన్ని రోజులుగా అత్యంత వైభవంగా సాగుతున్న నాభి శిలా (బొడ్రాయి) విగ్రహ ప్రతిష్ఠాపన, గ్రామదేవతల పండుగల ఉత్సవాలు గురువారం నాటితో ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం సంతరించుకుంది. భక్తుల జయజయధ్వానాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రతిష్ఠాపన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని బిఆర్ఎస్ మండల బీసీ సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గంలోని పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుండి ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మ్యాకల కనకయ్య
ఈ సందర్భంగా మ్యాకల కనకయ్య ముదిరాజ్ మాట్లాడుతూ… గ్రామం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ నాభిశిల బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ, గ్రామదేవతల పండుగలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లు తెలిపారు. ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలు శ్రమించి, సహకరించిన గ్రామ పెద్దలకు, యువకులకు, భక్తులకు మరియు ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ దైవభక్తిని, సేవాగుణాన్ని అలవర్చుకున్నప్పుడే ప్రశాంతత లభిస్తుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.