హైకోర్టు నాలుగుసార్లు గడువు ఇచ్చినా కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదు?
గోషామహల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ ఆర్వీ మహేందర్ కుమార్

రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, ఆగస్టు 19: కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించి హైకోర్టు పరిధిలో విచారణ కొనసాగుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని గోషామహల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ ఆర్వీ మహేందర్ కుమార్ అన్నారు. హైకోర్టు నాలుగుసార్లు గడువు ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడానికి కారణమేంటో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం అబిడ్స్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ…
పేదింటి ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశంలో ప్రభుత్వం సరైన వాదనలు ఎందుకు వినిపించలేకపోయిందో స్పష్టం చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని అన్నారు.
ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, పింఛన్లను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంపు, రూ.500కే గ్యాస్ సిలిండర్, కల్యాణలక్ష్మి పథకంతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడిచినా హామీలను సంపూర్ణంగా అమలు చేయలేకపోయిందని మండిపడ్డారు.
వ్యవసాయంపై ఆధారపడిన గిరిజనులు, సాధారణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిరంతరాయంగా అమలైన రైతుబంధు పథకాన్ని రూ.15 వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో అందుతున్న రూ.10 వేల రైతుబంధు సాయాన్ని కూడా సక్రమంగా అందించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు నిత్యం గుర్తు చేసుకుంటున్నారని మహేందర్ కుమార్ పేర్కొన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.