ఎన్నికల వాగ్దానని నిలబెట్టుకున్న సర్పంచ్ వెంకటరెడ్డి..
రాయల్ పోస్ట్ న్యూస్ ప్రతినిది భువనగిరి ఆగస్ట్ 19/
బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన బి.ఎన్. తిమ్మాపురం గ్రామస్థులకు పునరావాసం, భూసేకరణ (ఆర్‌అండ్ఆర్) నిమిత్తం ప్రభుత్వం రూ.206 కోట్ల నిధులను విడుదల చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ శ్రీ ఎడ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులు భువనగిరి ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యేతో కలిసి గ్రామస్థులు, కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీగా భువనగిరి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలను చాటుకున్నారు.
నిర్వాసితులకు పూర్తిస్థాయి న్యాయమే లక్ష్యం: ఎమ్మెల్యే కుంభం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బస్వాపూర్ రిజర్వాయర్ కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన రైతులు, నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడమే తమ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
త్వరితగతిన నిధుల మంజూరు: గతంలో ఆర్‌అండ్‌ఆర్, భూసేకరణ నిధులు సకాలంలో విడుదల కాక సమస్యలు పెండింగ్‌లో పడ్డాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బి.ఎన్. తిమ్మాపురం ప్రజల సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి రూ.206 కోట్లు విడుదల చేశారని తెలిపారు.గోదావరి జలాలతో సాగునీరు: మూసీ మురుగు నీటిపై ఆధారపడే తిప్పలు తప్పించి, గోదావరి జలాలతో పంటలు సాగు చేసుకునేలా బస్వాపూర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే భువనగిరి, వలిగొండ, నకిరేకల్, రామన్నపేట, తుంగతుర్తి ప్రాంతాల రైతులకు పుష్కలంగా సాగునీరు అందుతుందని వెల్లడించారు.కాల్వల పనుల వేగవంతం: బస్వాపూర్ రిజర్వాయర్‌లో 5 టీఎంసీల నీటిని నింపేందుకు కృషి చేస్తున్నామని, నేషనల్ హైవే వద్ద కెనాల్ పనులతో పాటు బునాదిగాని, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాల్వల పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి-రవికుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖా-బాబురావు, ఆత్మ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ ఛైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల-వెంకటేశ్వర్లు, పిఎసిఎస్ (PACS) చైర్మన్లు సతీష్ పవన్, శ్యామ్ గౌడ్, పట్టణ కౌన్సిలర్లు, భువనగిరి నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు బి.ఎన్. తిమ్మాపురం గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

