చేనేతను ఆదరిస్తేనే కళాకారుల జీవితాల్లో వెలుగులు…చేనేత రంగ పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి..చేనేత కార్మికులను అన్ని విధాలా ఆదుకోవాలి

Fasiuddin Mohammed
2 Min Read

వరంగల్, ఆగస్టు 07రాయల్ పోస్ట్ న్యూస్ /

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని, శుక్రవారం వరంగల్ జిల్లా కేంద్రంలోని గోపాలస్వామి టెంపుల్ ప్రధాన చౌరస్తాలో ఉన్న చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మగ్గం విగ్రహానికి టీఆర్ఎస్ గ్రేటర్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు లయన్ డాక్టర్ వెంకటేశ్వర్ రావు పార్టీ నాయకులతో కలిసి పూలమాల వేసి చేనేత కార్మికుల సేవలను గౌరవించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ.. చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, కళాత్మక వారసత్వానికి ప్రతీక అని అన్నారు. దేశానికి పేరు తీసుకొచ్చే చేనేత రంగం నేడు అనేక సమస్యలతో సతమతమవుతుండటం బాధాకరమన్నారు.
చేనేత కార్మికులు తమ కష్టానికి తగిన గిట్టుబాటు ధరలు, స్థిరమైన మార్కెట్ లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించే విధానాలను మరింత విస్తరించాలని కోరారు. ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, కార్పొరేషన్లలో చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంచడంతో పాటు ప్రభుత్వ కొనుగోళ్లలో చేనేతకు ప్రాధాన్యం కల్పించాలని సూచించారు. చేనేత సహకార సంఘాలను బలోపేతం చేయడం, ముడి సరుకుపై రాయితీలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ మార్కెటింగ్, ఎగుమతులకు ప్రోత్సాహం, యువతను చేనేత రంగం వైపు ఆకర్షించే ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత కుటుంబాల సంక్షేమానికి సమగ్ర కార్యాచరణతో ముందుకు రావాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రతి ఒక్కరూ పండుగలు, శుభకార్యాలు, జాతీయ పర్వదినాల సందర్భంగా కనీసం ఒక చేనేత వస్త్రాన్ని కొనుగోలు చేసే అలవాటు పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల ఆదరణే చేనేత రంగానికి నిజమైన బలమని, చేనేతను కాపాడటం అంటే వేలాది కుటుంబాల జీవనోపాధిని కాపాడినట్లేనని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జి వీర బిక్షపతి, వరంగల్ తూర్పు ఇంచార్జి వెలిగేటి రవికుమార్, టిఆర్ఎస్ నాయకులు సుతేజ్, నిశాంత్ రావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article