రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, ఆగస్టు 06: ఈ నెల 2వ తేదీన బెంగళూరులో జరిగిన 15వ షోటోఖాన్ జాతీయ కరాటే పోటీలలో తెలంగాణ రాష్ట్రం జివిఆర్ కరాటే అకాడమీ నుండి 24 మంది విద్యార్థులు కటా, కుమితి విభాగాల్లో పోటీలో పాల్గొన్నారు. వారిలో బాలికలు మరియు బాలురు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు.

కటా విభాగంలో 15 బంగారు పతకాలు, 9 రజత పతకాలు, కుమితి విభాగంలో 23 బంగారు పతకాలు, 1 రజత పతకాలు సాధించారు. మొత్తం 38 బంగారు పతకాలు, 10 రజత పతకాలతో ఓవరాల్ చాంపియన్షిప్ కప్‌ను కైవసం చేసుకొని రాష్ట్రానికి గౌరవం తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎస్ అశోక్ కుమార్
జివిఆర్ కరాటే అకాడమీలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు పతకాలు మరియు ప్రశంస పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో బాలికలు ఆత్మరక్షణ నైపుణ్యం తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, మహిళలు మరియు బాలికలు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి ఈ విధమైన శిక్షణలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం వారిలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు.
జివిఆర్ కరాటే అకాడమీ ద్వారా ఎన్నో ప్రతిభావంతులైన విద్యార్థులు దేశానికే గర్వకారణంగా మారుతున్నారని, ఈ అవకాశాన్ని అందిస్తున్న అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జి ఎస్. గోపాల్ రెడ్డి గారి కృషి ప్రశంసనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో జివిఆర్ కరాటే అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జి ఎస్ గోపాల్ రెడ్డి, అకాడమీ బ్లాక్ బెల్ట్స్ , కరీం, అమృత రెడ్డి, గణ సంతోషిని రెడ్డి, సుధాకర్, వెంకట్ రెడ్డి మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.