పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి…ఓబీసీలకు ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి..జాతీయ బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

2 Min Read

దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో బీసీల పాత్ర కీలకమైనప్పటికీ వారి సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధికి అనుగుణమైన విధానాలు ఇంకా పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదన్నారు. బీసీల వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలంటే జనాభా గణనలో ప్రత్యేక ఓబీసీ కాలమ్‌ను చేర్చి సమగ్ర కులగణన నిర్వహించడం అత్యవసరమని పేర్కొన్నారు. ఖచ్చితమైన గణాంకాల ఆధారంగానే అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాలు, నిధుల కేటాయింపులు సమర్థవంతంగా అమలు చేయవచ్చని వివరించారు.

సామాజిక న్యాయం అనేది కేవలం నినాదం కాదని, అది రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యత అని ఆయన అన్నారు. బీసీలకు సంబంధించిన అంశాలను సమన్వయంతో పర్యవేక్షించి, విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయడానికి ఓబీసీల కోసం ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం కాలానుగుణ అవసరమని అభిప్రాయపడ్డారు. అలాంటి వ్యవస్థ ఏర్పడితే బీసీల అభివృద్ధికి దీర్ఘకాలిక విధానాలు రూపొందించే అవకాశం ఉంటుందని చెప్పారు.

రానున్న పార్లమెంట్ సమావేశాలు దేశ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే వేదికగా నిలవాలని, బీసీ బిల్లు, ఓబీసీ జనగణన, ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు వంటి అంశాలను ప్రాధాన్యంగా చర్చించి చట్టబద్ధ నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు, కుల సంఘాలు, ప్రజాసంఘాలు సామాజిక న్యాయం సాధనే లక్ష్యంగా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

సెమినార్‌లో పాల్గొన్న వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, బీసీల సమగ్ర అభివృద్ధికి డేటా ఆధారిత విధానాలు, రాజ్యాంగబద్ధ రక్షణలు, బలమైన సంస్థాగత వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో బీసీలకు సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.

📄 Generate e-Paper Clip
Share This Article