రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, జూలై 17: సామాజిక న్యాయం బీసీ బిల్లుతోనే సాధ్యమని జాతీయ బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు, బీసీ రిజర్వేషన్ల సాధన సమన్వయ జేఏసీ చైర్మన్ దుండ్ర కుమారస్వామి అన్నారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు దేశంలో సామాజిక న్యాయానికి కొత్త దిశానిర్దేశం చేసే వేదిక కావాలని, ఈ సమావేశాల్లో బీసీల హక్కులు, సంక్షేమం, సమాన అవకాశాల పరిరక్షణకు ఉద్దేశించిన బీసీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని, అలాగే దేశవ్యాప్తంగా ఓబీసీల అభ్యున్నతి కోసం ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని కాచిగూడలో గల జాతీయ బీసీ దళ్ ప్రధాన కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రక్షణ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో యాదవ హక్కుల రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మందకాల మణి యాదవ్‌తో పాటు వివిధ బీసీ, కుల సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో బీసీల పాత్ర కీలకమైనప్పటికీ వారి సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధికి అనుగుణమైన విధానాలు ఇంకా పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదన్నారు. బీసీల వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలంటే జనాభా గణనలో ప్రత్యేక ఓబీసీ కాలమ్‌ను చేర్చి సమగ్ర కులగణన నిర్వహించడం అత్యవసరమని పేర్కొన్నారు. ఖచ్చితమైన గణాంకాల ఆధారంగానే అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాలు, నిధుల కేటాయింపులు సమర్థవంతంగా అమలు చేయవచ్చని వివరించారు.
సామాజిక న్యాయం అనేది కేవలం నినాదం కాదని, అది రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యత అని ఆయన అన్నారు. బీసీలకు సంబంధించిన అంశాలను సమన్వయంతో పర్యవేక్షించి, విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయడానికి ఓబీసీల కోసం ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం కాలానుగుణ అవసరమని అభిప్రాయపడ్డారు. అలాంటి వ్యవస్థ ఏర్పడితే బీసీల అభివృద్ధికి దీర్ఘకాలిక విధానాలు రూపొందించే అవకాశం ఉంటుందని చెప్పారు.
రానున్న పార్లమెంట్ సమావేశాలు దేశ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే వేదికగా నిలవాలని, బీసీ బిల్లు, ఓబీసీ జనగణన, ప్రత్యేక కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు వంటి అంశాలను ప్రాధాన్యంగా చర్చించి చట్టబద్ధ నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు, కుల సంఘాలు, ప్రజాసంఘాలు సామాజిక న్యాయం సాధనే లక్ష్యంగా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
సెమినార్‌లో పాల్గొన్న వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, బీసీల సమగ్ర అభివృద్ధికి డేటా ఆధారిత విధానాలు, రాజ్యాంగబద్ధ రక్షణలు, బలమైన సంస్థాగత వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో బీసీలకు సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.