ఘనంగా రాజా బహదూర్ వెంకట రామారెడ్డి 157వ జయంతి వేడుకలు…మహిళా విద్యాభివృద్ధికి ఆయన ఆశయాలే స్ఫూర్తి: గుత్తా సుఖేందర్ రెడ్డి

Fasiuddin Mohammed
1 Min Read

రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, ఆగస్టు 22: హైదరాబాద్ తొలి హిందూ కోత్వాల్‌, ప్రముఖ సంఘ సంస్కర్త, విద్యావేత్త రాజా బహదూర్ వెంకట రామారెడ్డి 157వ జయంతి వేడుకలను ఆర్‌బీవీఆర్‌ఆర్‌ మహిళా కళాశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజా బహదూర్ వెంకట రామారెడ్డి మహిళా విద్యాభివృద్ధి, సామాజిక సంస్కరణలు, సమాజ సేవలో చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. విద్యార్థులు క్రమశిక్షణ, ఆరోగ్యకర జీవన విధానం, సామాజిక బాధ్యతతో ఎదిగి సమాజ అభ్యున్నతికి తోడ్పడాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జె. అచ్యుతా దేవి మాట్లాడుతూ, మహిళా సాధికారతకు రాజా బహదూర్ ఆశయాలు నేటికీ మార్గదర్శకమని అన్నారు. ఆయన కలలుగన్న సమాన విద్యా అవకాశాలను సాకారం చేయడంలో కళాశాల కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ఐదో న్యాక్ అక్రిడిటేషన్ చక్రంలో ‘ఏ’ గ్రేడ్ సాధించడం కళాశాల నాణ్యమైన విద్యకు నిదర్శనమన్నారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డిని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జె. అచ్యుతా దేవి, వైస్ ప్రిన్సిపాల్ కె. సింధూరి, కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ ప్రొఫెసర్ సుదర్శన్ రెడ్డి, హెచ్‌ఎంవీఎస్ సెక్రటరీ ప్రొఫెసర్ కె. ముత్యంరెడ్డి ఘనంగా సత్కరించారు.
జయంతి సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వం, చర్చా వేదిక, పుస్తక సమీక్ష, ఫోటోగ్రఫీ, ఎక్స్టెంపోర్ స్పీకింగ్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ముఖ్య అతిథి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.
స్టూడెంట్ అడ్వైజరీ కమిటీ కన్వీనర్ డా. డబ్ల్యూ. శారద, కో-కన్వీనర్ డా. ఎం. పల్లవి ఆధ్వర్యంలో అధ్యాపక బృందం కార్యక్రమాన్ని సమన్వయం చేయగా, జాతీయ గీతాలాపనతో వేడుకలు ముగిశాయి.

📄 Generate e-Paper Clip
Share This Article