రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, ఆగస్టు 17: జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన విశిష్ట సేవా మెడల్ (VSM)కు ఎంపికైన సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ జే. నర్సయ్యను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజా సంబంధాల అధికారి (PRO) టి. రాజ్ కుమార్ అదనపు డీసీపీ జే. నర్సయ్యను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు.
జాతీయ స్థాయిలో విశిష్ట సేవా మెడల్‌కు జే. నర్సయ్య ఎంపిక కావడం పట్ల టి. రాజ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. పోలీసు శాఖలో విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు అందిస్తున్న సేవలకు ఈ గుర్తింపు నిదర్శనమని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండటం, విధి నిర్వహణలో క్రమశిక్షణతో వ్యవహరించడం వంటి అంశాలు ఆయన సేవలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయని అన్నారు.
విశిష్ట సేవా మెడల్‌కు ఎంపిక కావడం జే. నర్సయ్య వ్యక్తిగత ప్రతిభకు మాత్రమే కాకుండా, పోలీసు శాఖలో ఆయన అందిస్తున్న సేవలకు లభించిన గౌరవంగా భావిస్తున్నామని టి. రాజ్ కుమార్ తెలిపారు. భవిష్యత్తులోనూ మరింత సమర్థవంతంగా ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జే. నర్సయ్యను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) తెలంగాణ ప్రతినిధులు అభినందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రతినిధులు పాల్గొని అదనపు డీసీపీకి శుభాకాంక్షలు తెలిపారు.
