భువనగిరి మున్సిపాలిటీలో ‘జన’ సమస్యలు.. చాలని సిబ్బంది!– వర్షాకాలంలో ముప్పు.. విద్యుత్, నీరు, పారిశుధ్యంపై మున్సిపల్ కౌన్సిల్‌లో ఫైర్– ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పెంచాలని 23వ వార్డు కౌన్సిలర్ బర్రె పూజిత జహంగీర్ డిమాండ్…

Fasiuddin Mohammed
2 Min Read

భువనగిరి రాయల్ పోస్ట్ న్యూస్ ప్రతినిధి ఎం డి ఫసియుద్దీన్ (ఆగస్టు 6)
వర్షాలు కురుస్తున్న కొద్దీ భువనగిరి పట్టణంలో పారిశుధ్యం, విద్యుత్, తాగునీటి సరఫరా సమస్యలు జటిలమవుతున్నాయి. ప్రజల నుంచి రోజూ వినతులు వెల్లువెత్తుతున్నా, క్షేత్రస్థాయిలో సమస్యలను తీర్చేందుకు తగినంత మంది సిబ్బంది లేకపోవడం స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మున్సిపాలిటీలోని 35 వార్డుల్లో ఏర్పడుతున్న అత్యవసర సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోవడం లేదని 23వ వార్డు కౌన్సిలర్ బర్రె పూజిత జహంగీర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
​వివిధ విభాగాల్లోని తీవ్ర కొరతను ఆమె కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లిన వివరాలు ఇలా ఉన్నాయి:
​వీధి దిపాలు – రక్షణ కొరవడిన విద్యుత్ విభాగాలు: పట్టణంలో దాదాపు 6 వేల నుంచి 9 వేల వీధిదీపాల స్థంభాలు, 280 మాన్యువల్, 100 ఆటోమేటిక్ స్విచ్ బోర్డులు ఉన్నాయి. ఒక్క లైటును బాగు చేయాలన్నా కనీసం ముగ్గురు సిబ్బంది (పైకి ఎక్కే వ్యక్తి, నిచ్చెన పట్టుకునే వ్యక్తి, లైన్ క్లియరెన్స్ ఇచ్చే వ్యక్తి) అవసరం. ఈ నేపథ్యంలో ఒక్క టీమ్ రోజంతా తిరిగినా కొన్ని ప్రాంతాలకే పరిమితం కావాల్సి వస్తోంది. గతంలో ఆరుగురు టెక్నికల్ సిబ్బంది ఉండగా, ప్రస్తుత వర్షాకాల అత్యవసర పరిస్థితు దృష్ట్యా కనీసం 12 మంది ఔట్‌సోర్సింగ్ వర్కర్లను నియమించాలని ఆమె కోరారు.
​తాగునీటి విభాగం – ఆరకొర సిబ్బంది: గతంలో నీటి సరఫరా విభాగానికి 9 మంది ఉద్యోగులు ఉండగా, ప్రస్తుతం కేవలం ఇద్దరు మేస్త్రీలు, ఇద్దరు వర్కర్లతో కలిపి నలుగురే పనిచేస్తున్నారు. వర్షాల వల్ల 35 వార్డుల పరిధిలో పైప్‌లైన్లు పగిలిపోవడం, లీకేజీల సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ నలుగురితో రోజూవారీ లీకేజీలు అరికట్టడం సాధ్యం కాదని, వెంట‌నే మరో తొమ్మిది మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని కేటాయించాలని కోరారు.
​పారిశుధ్యం – వ్యాధుల ముప్పు: వర్షాలకు మురుగు కాలువలు పూడికపడి దోమలు, అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. మున్సిపాలిటీకి ప్రజారోగ్యమే ప్రాధాన్యత కాబట్టి, వెంటనే అదనపు పారిశుధ్య కార్మికులను తీసుకుని డ్రైనేజీల శుభ్రతను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
​పట్టణ పౌరులకు మెరుగైన విద్యుత్, పరిశుభ్రమైన నీరు, ఆరోగ్యకరమైన పరిసరాలను అందించడం మున్సిపాలిటీ బాధ్యత అని కౌన్సిలర్ బర్రె పూజిత జహంగీర్ స్పష్టం చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి, అదనపు ఔట్‌సోర్సింగ్ నియామకాలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

📄 Generate e-Paper Clip
Share This Article