రాయల్ పోస్ట్ న్యూస్ ఉప్పల్ ఆగస్ట్ 4/ కాప్రా డివిజన్ పరిధిలోని సాయిబాబా నగర్లో ప్రతిపాదించిన విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటుపై స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆందోళన నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు హబ్సిగూడ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఆపరేషన్) ఇంజి. పి. వెంకన్న గారిని వారి కార్యాలయంలో ఉప్పల్ లో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నివాసాల మధ్య విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం వల్ల వైబ్రేషన్, శబ్ద కాలుష్యం తదితర సమస్యలతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల అభ్యంతరాలను గౌరవించి, సాయిబాబా నగర్లో సబ్స్టేషన్ ఏర్పాటు నిర్ణయాన్ని విరమించుకోవాలని లేదా జనావాసాలకు దూరంగా ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించాలని కోరారు.
ప్రజల భద్రత, ఆరోగ్యం, ప్రశాంత జీవనమే తమకు ముఖ్యమని, స్థానికుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే విద్యుత్ శాఖ అధికారులను కోరారు.
ఈ సందర్భంగా సూపరింటెండింగ్ ఇంజనీర్ ఇంజి. పి. వెంకన్న ఎమ్మెల్యే వినతిని స్వీకరించి, ప్రజల అభిప్రాయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
