రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 29/
చీమల కొండూరు మెయిన్ రోడ్డు భువనగిరి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా లోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో బిజ్జాల మంజుల వెంకటేష్ గుప్త గారి ఆధ్వర్యంలో
గురుపూర్ణిమ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వేలాదిమంది భక్తులు విచ్చేసి చీమల కొండూరు మెయిన్ రోడ్డు లోని శ్రీ సాయిబాబా దివ్య దర్శనాన్ని పొందారు
ఈ సందర్భంగా బిజ్జాల వెంకటేష్ గుప్త గారు మాట్లాడుతూ, గురుపూర్ణిమకు ఎంతో విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని వివరించారు. భగవాన్ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన అనంతరం తన తొలి ధర్మోపదేశాన్ని కాశీ సమీపంలోని సారనాథ్‌లో ఈ పౌర్ణిమ రోజునే అందించారని, అందువల్ల ఈ రోజును గురుపూర్ణిమగా కూడా ఆచరిస్తున్నామని తెలిపారు. ప్రతి వ్యక్తి తన సద్గురువును భక్తిశ్రద్ధలతో ఆరాధించడంతో పాటు షిరిడి సాయిబాబాను ఈ పవిత్ర దినాన పూజించాలని సూచించారు.
గురుపూర్ణిమ వేడుకల్లో భాగంగా భక్తులతో కలిసి సామూహిక ధ్యానం నిర్వహించారు. అనంతరం పంచకుండాత్మక హవనం, అభిషేకం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ సందర్భంగా వేలాదిమంది భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు.
కుండపోత వర్షం కురిసినప్పటికీ భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాదిమంది శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం చేరుకుని బాబా వారి ఆశీస్సులు స్వీకరించి ఆధ్యాత్మిక ఆనందంతో తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు.
