అత్యంత వైభవంగా రమణేశ్వరంలో గురుపూర్ణిమ మహోత్సవాలు……సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి దివ్య దర్శనం

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 29/రమణేశ్వరంలో గురుపూర్ణిమ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వేలాదిమంది భక్తులు విచ్చేసి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి దివ్య దర్శనం పొందారు.

ఈ సందర్భంగా సిద్ధగురు మాట్లాడుతూ, గురుపూర్ణిమకు ఎంతో విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని వివరించారు. భగవాన్ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన అనంతరం తన తొలి ధర్మోపదేశాన్ని కాశీ సమీపంలోని సారనాథ్‌లో ఈ పౌర్ణిమ రోజునే అందించారని, అందువల్ల ఈ రోజును గురుపూర్ణిమగా కూడా ఆచరిస్తున్నామని తెలిపారు. ప్రతి వ్యక్తి తన సద్గురువును భక్తిశ్రద్ధలతో ఆరాధించడంతో పాటు పరమశివుడిని, భగవాన్ బుద్ధునినీ ఈ పవిత్ర దినాన పూజించాలని సూచించారు.

గురుపూర్ణిమ వేడుకల్లో భాగంగా సిద్ధగురు భక్తులతో కలిసి సామూహిక ధ్యానం నిర్వహించారు. అనంతరం పంచకుండాత్మక హవనం, భగవాన్ బుద్ధునికి అభిషేకం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ సందర్భంగా వేలాదిమంది భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు.

కుండపోత వర్షం కురిసినప్పటికీ భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాదిమంది రమణేశ్వరానికి చేరుకుని సిద్ధగురు వారి ఆశీస్సులు స్వీకరించి ఆధ్యాత్మిక ఆనందంతో తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు.

📄 Generate e-Paper Clip
Share This Article