రాయల్ పోస్ట్ న్యూస్ గజ్వెల్ , 11 ఆగస్టు 2026 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పట్టణం నుంచి రామాయంపేట వెళ్లే జాలిగామ బైపాస్ రోడ్డు సంపూర్ణంగా గుంతలమయంగా మారి, వాహనదారులకు నరకప్రాయంగా తయారైందని గజ్వేల్ మండల బిజెపి అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతినిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ కీలక బైపాస్ రోడ్డులో పెద్ద ఎత్తున గుంతలు పడటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రయాణికులు తీవ్ర భయాందోళనల మధ్య ప్రయాణించాల్సి వస్తోందని పేర్కొన్నారు. గతంలో వార్తాపత్రికలలో ఈ రహదారి దుస్థితిపై విస్తృతంగా కథనాలు ప్రచురితమైనప్పటికీ, సంబంధిత అధికారులు, పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి, వెంటనే స్పందించి జాలిగామ బైపాస్ రోడ్డుకు మరమ్మతులు చేపట్టి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల తరఫున బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
