అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ స్వతంత్ర వైఖరిని కొనసాగించాలి…సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు

Fasiuddin Mohammed
4 Min Read

హైదరాబాద్, ఆగస్టు 08 రాయల్ పోస్ట్ న్యూస్ : దేశ స్వతంత్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల్లో స్వతంత్ర వైఖరిని కొనసాగించాల్సిన అవసరం ఉందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు పేర్కొన్నారు. భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం ( (ఇస్కఫ్) జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్బంగా హైదరాబాద్, హిమాయత్ నగర్, అమృత ఎస్టేట్స్, ఇస్కఫ్ రాష్ట్ర కార్యాలయంలో శనివారం “ఇరాన్‌పై అమెరికా యుద్ధం – భారత్‌పై ప్రభావం” అనే అంశంపై ఇస్కఫ్ జాతీయ అధ్యక్షులు, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో సయ్యిద్ అజీజ్ పాషా తోపాటు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివ రావు, మాజీ ఎమ్యెల్సీ, ప్రో. కె. నాగేశ్వర్, మంగోలియా మాజీ భారత రాయబారి టి. సురేష్, ఇస్కఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ పదిహరి, రాష్ట్ర అధ్యక్షులు కాడారు ప్రభాకర్ రావు, ప్రధాన కార్యదర్శి ఆర్. గోపాల్, ఉపాధ్యక్షులు పి.వి. దుర్గ ప్రసాద్, కోశాధికారి ఏ. విజయలక్ష్మి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ భారతదేశ విదేశాంగ విధానంలో ఒకప్పుడు కీలకంగా ఉన్న నాన్ అలియెన్డ్ మూవ్మెంట్ (అలీన) విధానాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు. నెహ్రూ హయాంలో భారత్ అనుసరించిన అలీన విధానం అనంతర కాలంలో విస్మరణకు గురైందని ఆయన అన్నారు. ప్రస్తుతం దేశంలో ఫాసిస్టు భావజాలానికి సంబంధించిన అనేక విధానాలు అమలవుతున్నాయని ఆరోపించారు. మతం, దేశం, జాతి పేర్లతో ప్రజలను విభజించే ధోరణులు పెరుగుతున్నాయని విమర్శించారు. హిందుత్వ పేరుతో సాగుతున్న రాజకీయాలు ఒక రకమైన జాతి దురహంకారానికి దారితీస్తున్నాయని అన్నారు. అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నిస్తోందని, భారత విదేశాంగ విధానంలోనూ అమెరికాతో సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కూనంనేని సాంబశివరావు విమర్శించారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా భారత విద్యార్థులను చేతులకు సంకెళ్లు వేసి భారత్ పంపిన ఘటనలను ఆయన ప్రస్తావించారు. ఇలాంటి సందర్భాల్లోనూ కేంద్ర ప్రభుత్వం అమెరికా వైఖరిని గట్టిగా ప్రశ్నించకపోవడం ఆందోళనకరమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమాజం, దేశ ప్రయోజనాల కోసం ఇస్కాఫ్ వంటి ప్రజా సంఘాలు ప్రజల గొంతుకగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇస్కాఫ్ చారిత్రక నేపథ్యం ఉందని, భారతదేశంలోని అనేక ప్రజా సంస్థల భావజాలంపై వామపక్ష ఉద్యమం ప్రభావం ఉందని పేర్కొన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలు, సామాన్య ప్రజల సమస్యలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రజాస్వామ్య, లౌకిక, సామాజిక న్యాయం, సార్వభౌమత్వ విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇస్కాఫ్ మరింత చురుకుగా పనిచేయాలని కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ, భద్రతా పరిణామాల నేపథ్యంలో భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేలా సమతుల్యమైన, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగించాలని సూచించారు. భారత్ ఆర్థిక, ఇంధన, భద్రతా ప్రయోజనాలకు పశ్చిమాసియా అత్యంత కీలకమైన ప్రాంతమని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియాలో సుమారు కోటి మంది భారతీయులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారని, వారు భారత్ పంపుతున్న రెమిటెన్సులు దేశ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన మద్దతుగా నిలుస్తున్నాయని అన్నారు. 1991లో భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయులు పంపిన నగదు దేశానికి ఎంతో ఉపయోగపడిందని గుర్తుచేశారు. భారత్ ఇంధన అవసరాలకు పశ్చిమాసియా ఎంతో కీలకమని ఆయన అన్నారు. చమురు, ఎల్ సహజవాయువు వంటి ఇంధన వనరుల దిగుమతుల్లో ఈ ప్రాంతం ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహాత్మక సంబంధాల నేపథ్యంలో భారత్ తన సంప్రదాయ విదేశాంగ విధానంలోని వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కోల్పోతోందనే ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ చోటుచేసుకున్న పరిణామాలు, సైనిక దాడుల విషయంలో భారత్ స్పందించిన తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో అంతర్జాతీయ సంక్షోభాల విషయంలో భారత్ వ్యవహరించిన విధానంతో పోలిస్తే ఇరాన్ విషయంలో భిన్నమైన వైఖరి కనిపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. బ్రిక్స్ వంటి అంతర్జాతీయ వేదికల్లో భారత్ తన స్వతంత్ర వైఖరిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నాగేశ్వర్ రావు అన్నారు. అమెరికా ఒత్తిళ్ల కారణంగా కొన్ని సందర్భాల్లో భారత్ తన స్వతంత్ర దౌత్య వైఖరిని పూర్తిస్థాయిలో ప్రదర్శించలేకపోతోందనే అభిప్రాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. అజీజ్ పాషా మాట్లాడుతూ ఇతర దేశాలతో సాంస్కృతిక, సామాజిక సంబంధాలను బలోపేతం చేయడం, వివిధ దేశాల కళలు, సాహిత్యం మరియు సాంస్కృతిక విలువలను పరస్పరం పంచుకోవడం, ప్రపంచ శాంతి, సద్భావన మరియు సమైక్యత కోసం ప్రజలను ఐక్యం చేయడమే ‘ఇండియన్ సొసైటీ ఫర్ కల్చరల్ కో-ఆపరేషన్ అండ్ ఫ్రెండ్‌షిప్’ (ఇస్కఫ్) లక్ష్యం అని తెలిపారు. విజయ్ కుమార్ పదిహరి మాట్లాడుతూ 1944లో ముంబైలో ప్రారంభమైన ఇస్కఫ్ అనేది భారతదేశం మరియు ఇతర దేశాల మధ్య సాంస్కృతిక బంధాలను, స్నేహభావాన్ని పెంపొందించడానికి ఏర్పడిన ప్రముఖ ప్రజా సంఘం అని తెలిపారు.

📄 Generate e-Paper Clip
Share This Article