జాతీయ స్థాయిలో వరంగల్ బోమిస్ విద్యార్థుల క్రీడా ప్రతిభకు ఘన గుర్తింపు…

2 Min Read

సీబీఎస్‌ఈ క్లస్టర్ అథ్లెటిక్స్‌లో విశేష ప్రతిభ.. రిలేలో నాలుగో స్థానం, వ్యక్తిగత విభాగాల్లో మెరుగైన ఫలితాలు

విద్యార్థులను అభినందించిన బిర్లా విద్యాసంస్థల చైర్మన్ లయన్ డాక్టర్ వెంకటేశ్వర్ రావు

హనుమకొండ, జూలై 29 రాయల్ పోస్ట్ న్యూస్ /

క్రీడా రంగంలో వరంగల్ ప్రతిష్ఠను మరోసారి జాతీయ వేదికపై చాటుతూ బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (బోమిస్) విద్యార్థులు సీబీఎస్‌ఈ క్లస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో దేశంలోని 455 సీబీఎస్‌ఈ పాఠశాలలకు చెందిన 8,561 మంది అథ్లెట్లు పాల్గొనగా, బోమిస్ విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు పొందారు. అండర్-17 బాలుర 4×100 మీటర్ల రిలే పోటీలో బోమిస్ జట్టు 455 పాఠశాలల మధ్య నాలుగో స్థానం సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. వ్యక్తిగత విభాగాల్లో కౌశిక్ 200 మీటర్ల పరుగులో ద్వితీయ స్థానం సాధించగా, శరణ్య 100 మీటర్ల పరుగులో మూడో స్థానంలో నిలిచి పతకాలను అందుకున్నారు. షారోన్ షాట్‌పుట్ ఫైనల్స్‌కు అర్హత సాధించగా, అండర్–17 బాలుర లాంగ్ జంప్ విభాగంలో ఆరో స్థానం సాధించడం ద్వారా పాఠశాల క్రీడా ప్రస్థానానికి మరింత గౌరవం తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ జయప్రకాష్ మాట్లాడుతూ.. క్రీడలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన తమ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, వరంగల్‌కు మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. విజయం సాధించిన క్రీడాకారులను, వారికి శిక్షణ అందించిన కోచ్‌లను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం ఘనంగా అభినందించింది. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల్లో సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి బోమిస్ కృషి చేస్తోందని పేర్కొంది. సీబీఎస్‌ఈ క్లస్టర్ అథ్లెటిక్స్‌లో బోమిస్ విద్యార్థుల ఈ విజయాలు వరంగల్ విద్యా, క్రీడా రంగాలకు మరో గర్వకారణంగా నిలిచాయని పలువురు విద్యావేత్తలు, తల్లిదండ్రులు ప్రశంసించారు.

📄 Generate e-Paper Clip
Share This Article