రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 15/యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాలు, పర్యవేక్షణలో తుర్కపల్లి పోలీసులు వేగంగా స్పందించి, పిల్లల ఆట కరెన్సీ నోట్లను ఉపయోగించి అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి నేరానికి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
తుర్కపల్లి మండలానికి చెందిన ఒక వ్యక్తిని నిందితులు సంప్రదించి, రూ.1,00,000 ఇస్తే రూ.2,00,000 నగదు ఇస్తామని ఆశ చూపి నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు పల్లెపహాడ్ స్టేజ్ సమీపంలో రూ.1,00,000 నగదును వారికి అప్పగించాడు. అనంతరం నిందితులు ఇచ్చిన కరెన్సీ కట్టలను పరిశీలించగా, పైన మరియు కింద మాత్రమే అసలైన ₹500 నోట్లు ఉంచి, మధ్యలో “Children’s Bank of India – Specimen” అని ముద్రించిన పిల్లల ఆట కరెన్సీ నోట్లను ఉంచి మోసం చేసినట్లు గుర్తించాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు తుర్కపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, సాంకేతిక ఆధారాలు మరియు సమాచారాన్ని సేకరించి 15-07-2026న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు చేసిన నిందితులు
ముదురుకోల యాకంబరం (29), భువనగిరి.
ముదురుకోల దేవేందర్ (38), భువనగిరి.
మద్దెబోయిన నాగరాజు (34), కుంట్లూరు, హయత్‌నగర్.
స్వాధీనం చేసుకున్న వస్తువులు
పిల్లల ఆట కరెన్సీ నోట్ల 16 కట్టలు.
రూ.10,000 నగదు.
ఒక హీరో హోండా ప్యాషన్ మోటార్ సైకిల్.
మూడు మొబైల్ ఫోన్లు. స్వాదినం.. పోలీసుల
విచారణలో ప్రధాన నిందితుడు ముదురుకోల యాకంబరం గతంలో సుబేదారి, నర్సంపేట పోలీస్ స్టేషన్లలో నమోదైన నకిలీ కరెన్సీ కేసుల్లో నిందితుడిగా ఉండి, ఆ కేసుల్లో అరెస్టై జ్యుడీషియల్ రిమాండ్‌కు వెళ్లినట్లు, ఇటీవల జైలు నుంచి విడుదలై మళ్లీ ఇదే తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్ ప్రజలకు సూచిస్తూ, సులభంగా అధిక డబ్బు వస్తుందనే ఆశతో ఎవరైనా చేసే ఆఫర్లను, కరెన్సీ మార్పిడి పేరుతో జరిగే మోసాలను నమ్మవద్దని తెలిపారు. ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే ఇటువంటి మోసాలను నివారించవచ్చని పేర్కొన్నారు.
ఈ కేసును జిల్లా ఎస్పీ శ్రీ అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్ పర్యవేక్షణలో, డీఎస్పీ శ్రీ పి. శ్రీనివాస్ నాయుడు, యాదగిరిగుట్ట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం. శంకర్ మార్గదర్శకత్వంలో, తుర్కపల్లి ఎస్‌ఐ మహమ్మద్ తఖియుద్దీన్ మరియు పోలీసు సిబ్బంది విజయవంతంగా ఛేదించారు.
