నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక ఉపేక్షించేది లేదు!

Fasiuddin Mohammed
2 Min Read

మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపైనా కేసులు
త్రిబుల్ రైడింగ్, శబ్ద కాలుష్య సైలెన్సర్లపై పోలీసుల నజర్

వాహనదారులు బాధ్యతగా వ్యవహరించాలి

వైరా ఏసీపీ సారంగపాణి

రాయల్ పోస్ట్ న్యూస్ వైరా ఆగస్ట్ 8/ రహదారి భద్రత విషయంలో వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదాల బారిన పడటమే కాకుండా చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని వైరా ఏసీపీ సారంగపాణి హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని స్పష్టం చేశారు.శనివారం వైరా రింగ్‌రోడ్డు వద్ద ఏసీపీ సారంగపాణి ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర, ఇతర వాహనాలను తనిఖీ చేసి హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, నంబర్ ప్లేట్ తదితర అంశాలను పరిశీలించారు.

మైనర్ల చేతికి వాహనాలు ఇవ్వొద్దు

మైనర్లు ద్విచక్ర వాహనాలు నడపడం ప్రమాదకరంగా మారుతోందని ఏసీపీ పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలని, వారికి వాహనాలు ఇవ్వకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మైనర్ వాహనం నడుపుతూ ప్రమాదానికి గురైతే తల్లిదండ్రులు కూడా చట్టపరమైన చర్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.

త్రిబుల్ రైడింగ్.. ప్రమాదాలకు ప్రధాన కారణం

ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించడం వల్ల వాహనంపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటుందని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా యువత సరదా కోసం ట్రిపుల్ రైడింగ్‌కు పాల్పడుతూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టవద్దని సూచించారు.

మోత మోగించే సైలెన్సర్లపై చర్యలు

వాహనాల కంపెనీ సైలెన్సర్లను తొలగించి అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు అమర్చడం వల్ల ఇతర వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు మార్చే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నంబర్ ప్లేట్ లేకుంటే అనుమానమే

ప్రతి వాహనానికి తప్పనిసరిగా నంబర్ ప్లేట్ ఉండాలని ఏసీపీ తెలిపారు. నంబర్ ప్లేట్ లేకుండా లేదా స్పష్టంగా కనిపించకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు, నేరాల సమయంలో వాహనాలను గుర్తించడం కష్టమవుతుందని పేర్కొన్నారు.

హెల్మెట్.. ప్రాణాలకు రక్షణ కవచం

హెల్మెట్ ధరించడం కేవలం పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి కాదని, ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడుకునేందుకు అని ఏసీపీ సారంగపాణి సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని కోరారు.

రోడ్డుపై కొద్దిసేపటి నిర్లక్ష్యం జీవితాంతం కుటుంబాన్ని విషాదంలోకి నెట్టే అవకాశం ఉందని, అందుకే ప్రతి ఒక్కరూ “నా భద్రత.. నా కుటుంబ భద్రత” అనే బాధ్యతతో వాహనాలు నడపాలని ఏసీపీ సూచించారు.

ఈ కార్యక్రమంలో వైరా సీఐ వెంకటప్రసాద్, ఎస్‌ఐ పుష్పాల రామారావుతో పాటు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article