సర్పంచ్, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి ప్రజావాణిలో కలెక్టర్ కు దళిత మహిళ ఫిర్యాదు

2 Min Read

పాపన్నపేట, రాయల్ పోస్ట్,జూన్ 15…
తమకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారని, ఇందుకు కారణమైన గ్రామ సర్పంచ్ మరియు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతూ పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామానికి చెందిన రేవెళ్ళి సంధ్య సోమవారం కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన ప్రజావాణిలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సమక్షంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. తనకు నివసించేందుకు సొంత ఇల్లు లేకపోవడంతో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా, ఇటీవల ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసిందని తెలిపారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా గ్రామ పెద్దల సూచన మేరకు ఇంటి నిర్మాణ బాధ్యతను కాంట్రాక్టర్‌కు అప్పగించినట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టర్ ఇంటి నిర్మాణంలో భాగంగా బేస్‌మెంట్‌ స్థాయి వరకు పనులు పూర్తి చేసిన అనంతరం, అకస్మాత్తుగా మెటీరియల్ సరఫరా నిలిపివేసి పనులను ఆపివేశాడని ఆరోపించారు.

ఈ విషయమై కాంట్రాక్టర్‌ను ప్రశ్నించగా, గ్రామ సర్పంచ్ శ్రీధర్ ఆదేశాల మేరకే పనులు నిలిపివేశానని చెప్పినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం సర్పంచ్‌ను కలిసి కారణం అడగగా, గత సర్పంచ్ ఎన్నికల్లో తమ కుటుంబం తనకు ఓటు వేయలేదనే కారణంతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని నిలిపివేసినట్లు స్పష్టంగా తెలిపారని ఆరోపించారు. అంతేకాకుండా, తనను ఆ 30 మంది గెలిపించారని, వారు అనుమతిస్తేనే ఇంటి నిర్మాణం కొనసాగుతుందని, పదేపదే తన ఇంటికి రావద్దని హెచ్చరించినట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఇప్పటికే బేస్‌మెంట్‌ పనులు పూర్తయ్యాయని, ఆ దశకు సంబంధించిన ఒక బిల్లును కాంట్రాక్టర్‌కు చెల్లించినప్పటికీ నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

కావున, తన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని అర్ధాంతరంగా నిలిపివేసిన కాంట్రాక్టర్‌తో పాటు, నిలిపివేతకు కారణమైన గ్రామ సర్పంచ్‌పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, తన ఇంటి నిర్మాణం పూర్తయ్యేలా జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని రేవెళ్ళి సంధ్య ప్రజావాణి ద్వారా జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కొత్తూరి శ్రీనివాస్, బద్రి మల్లేశం, మన్నె వెంకటేశం తదితరులు ఉన్నారు.

దళిత సంఘాల ఆగ్రహం:

రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాన్ని కాంట్రాక్టర్ మరియు గ్రామ సర్పంచ్ అర్ధాంతరంగా నిలిపివేయడం పట్ల మెదక్ జిల్లా దళిత సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత కుటుంబం పట్ల సర్పంచ్ తీరు సరికాదని, ఇలాంటివి పునరావృతమైతే ఆందోళనలు సైతం చేస్తామని హెచ్చరించారు.

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *