
(రాయల్ పోస్ట్ న్యూస్ మహేశ్వరం మే 22:)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పటి.పాండురంగారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చెప్పుకుంటున్నప్పటికీ,క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్,టిఆర్ఎస్ నాయకులు కప్పాటి పాండురంగా రెడ్డి విమర్శించారు.రైతులు తమ పంటను అమ్ముకోవడానికి రోజులు తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురుచూస్తున్నా,సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు.జిల్లాలోని పలు మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసుకువచ్చిన ధాన్యంలో 50 శాతం కూడా కొనుగోలు చేయలేదని తెలిపారు.ప్రభుత్వం నిర్ణయించిన నాణ్యతా ప్రమాణాల పేరుతో ఆరబెట్టిన ధాన్యానికీ ‘తేమ ఎక్కువ’అని సాకులు చెబుతూ, క్వింటాలుకు 5 నుండి 8 కిలోల వరకు తరుగు తీస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు.కొనుగోలు కేంద్రాల వద్ద త్రాగునీరు,నీడ వంటి కనీస సౌకర్యాలు లేక రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లు కూడా అందుబాటులో లేవని విమర్శించారు.ధాన్యం విక్రయించినా రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడు జమవుతాయో తెలియక అయోమయం నెలకొంది.ఈ పరిస్థితుల వల్ల తదుపరి సాగు కోసం రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని తెలిపారు.సన్న రకం వరి పండించిన రైతులకు క్వింటాకు రూ. 500 బోనస్‌ను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి గన్నీ బ్యాగులు సరఫరా చేయడంతో పాటు,తేమ శాతం పేరుతో రైతులను వేధిస్తున్న మిల్లర్లు,అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.ధాన్యం కొనుగోళ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, లేకపోతే రైతుల తరఫున ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.