హైదరాబాద్, ఆగస్టు 08 రాయల్ పోస్ట్ న్యూస్ / తెలంగాణ ఉద్యమ తరహాలో ప్రజా గ్రంథాలయాల అభివృద్ధి కోసం మలిదశ గ్రంధాలయోధ్యమం చేపట్టాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ అన్నారు. తెలంగాణ ప్రజా గ్రంధాలయాల అభివృద్ధి సంఘం అధ్యక్షుడు కొక్కుల దేవేందర్ అధ్యక్షతన శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ‘తెలంగాణ ప్రజా గ్రంధాలయాలు ప్రస్తుత స్థితి సవాళ్లు మరియు భవిష్యత్తు దిశ నిర్దేశము’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ… ప్రజలకు విజ్ఞానం అందించేవి గ్రంధాలయాలని, ఇటువంటి గ్రంధాలయాలను కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. గ్రంధాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో చర్చించేందుకు అభివృద్ధి నివేదిక తయారు చేయాలని ఆయన నిర్వహాకులకు సూచించారు. ముఖ్యంగా జిల్లా గ్రంధాలయ సంస్థలకు ప్రజలు కట్టే ప్రాపర్టీ టాక్స్ ద్వారా మున్సిపల్, గ్రామ పంచాయితీలు వసూలు చేసే అమౌంట్ నుంచి 8 శాతం పర్సంటేజ్ లైబ్రరీ సెస్ కింద ఆయా జిల్లా గ్రంధాలయ సంస్థలకు ఎప్పటికప్పుడు చెల్లిస్తేనే గ్రంధాలయాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఇప్పటి వరకు వివిధ మున్సిపాలిటీలు, పంచాయతీలు కొన్ని వందల కోట్ల రూపాయలు జిల్లా గ్రంథాలయ సంస్థలకు బకాయిలుగా ఉన్నాయని కొక్కుల దేవేందర్ తెలిపారు. గ్రంథాలయాల అభివృద్ధి గూర్చి, గ్రంథాలయ సెస్ గురించి, రిక్రూట్మెంట్ గురించి ప్రొఫెసర్ ఎస్.సుదర్శన్ రావు వివరించారు. కార్యక్రమంలో వనం దుశ్యంతల, తుమ్మ సత్యనారాయణ, సుధాకర్ గౌడ్, ప్రొఫెసర్ ప్రపుల్ల చంద్ర, సంగిశెట్టి శ్రీనివాస్, కస్తూరి ప్రభాకర్, దాచేపల్లి బుచ్చయ్య, సోమ శివయ్య, షేక్ ఆడం షఫీ, బైరి నర్సయ్య, పి.చంద్రయ్య, బి.మహేందఱ కె. వెంకటేశ్వర్ రెడ్డి, కుమారస్వామి, గ్రంధాలయ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
