రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి ఆగస్ట్ 6/ భువనగిరి పట్టణంలో మున్సిపల్ స్థలాల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు కలకలం రేపుతున్నాయి. అధికారుల ఉదాసీనత, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల వైఫల్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






అనుమతుల్లేని కూల్చివేతలు: భువనగిరి ప్రధాన రహదారిలోని రామస్వామి యాదవ్ హోటల్ పక్కన ఉన్న మున్సిపల్ కమర్షియల్ షాపులను ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండానే ప్రైవేట్ వ్యక్తులు నేలమట్టం చేసి మట్టిని తరలించారు.వైఎస్ఆర్ మార్కెట్ వద్ద అక్రమ కట్టడం: గంజ్ పరిధిలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా బోరు వేయడమే కాకుండా, మూడంతస్తుల వాణిజ్య భవనాన్ని నిర్మిస్తున్నారు. మూడుసార్లు నోటీసులు ఇచ్చామని అధికారులు చెబుతున్నా పనులు మాత్రం యథేచ్ఛగా సాగుతున్నాయి.
వార్డుల్లో కబ్జాలు: 8వ వార్డులో సుమారు 600 గజాల మున్సిపల్ స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు రాళ్లు పాతారు.31వ వార్డు (సర్వే నం. 141)లో 250 గజాల మున్సిపల్ స్థలాన్ని నకిలీ పత్రాలతో ఆక్రమిస్తున్నారు.ఇండోర్ స్టేడియం కోసం కేటాయించిన 3 ఎకరాల 10 గుంటల భూమికి (సర్వే నం. 150) ప్రహరీ లేకపోవడంతో ఆక్రమణలకు గురవుతోంది.సింగమ్మగూడెంలో ప్రభుత్వ భూములకు అక్రమంగా ఇంటి నంబర్లు కేటాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
అధికారుల బాధ్యతారాహిత్యం:
కార్యాలయం పట్టణానికి వెలుపల ఉండటంతో హైదరాబాద్ నుండి వచ్చే సిబ్బంది వచ్చి వెళ్లడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని, దీంతో సేవలు పడకేశాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణాన్ని కబ్జా రహితంగా తీర్చిదిద్దుతానన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రకటనలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.
చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: మాజీ చైర్మన్ బర్రె జహంగీర్
మున్సిపల్ ఆస్తులను కూల్చివేయాలంటే R&B అధికారుల ధ్రువీకరణ, పాలకవర్గ తీర్మానం, టౌన్ ప్లానింగ్ అనుమతులు తప్పనిసరని మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ స్పష్టం చేశారు. అక్రమ కూల్చివేతలకు పాల్పడిన స్థలాన్ని మున్సిపాలిటీ తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కోరుతూ అదనపు కలెక్టర్ భాస్కర్రావుకు ఫిర్యాదు చేశారు.
కౌన్సిలర్లు పి.అమర్నాథ్, జె.వినోద్‌కుమార్‌లతో కలిసి కూల్చివేసిన స్థలాన్ని పరిశీలించిన ఆయన, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. 1953 మున్సిపల్ రికార్డులు, 1967 మాస్టర్ ప్లాన్ ఆధారంగా సర్వే జరిపి, ఖాళీ స్థలంలోj మున్సిపాలిటీయే నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు.