

రాయల్ పోస్ట్ న్యూస్ నల్గొండ ఆగస్ట్ 3/ నల్గొండ జిల్లాలోని చారిత్రాత్మకమైన పానగల్లు ఉదయ సముద్రం చెరువుపై దశాబ్దాలుగా కొనసాగుతున్న చేపల పెంపకపు నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు (TRMS) మరియు తెలంగాణ బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు ఎల్.వి. రమణ ముదిరాజ్ ఆధ్వర్యంలో నేడు నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో అధికారికంగా వినతిపత్రం సమర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ… గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేపల వేటపై నిషేధించబడిన 7 చెరువులలో (పానగల్లు ఉదయ సముద్రం, చేపూర్, ముప్పారం, మాదారం, కనగల్లు, ఎడవెల్లి గ్రామానికి చెందిన ఎర్ర సముద్రం, వాయిల సింగారం) ప్రభుత్వం పానగల్లు మినహా మిగతా 6 చెరువులపై నిషేధాన్ని ఎత్తివేసిందని తెలిపారు. ఆ చెరువుల్లో మత్స్యకారులు ఉపాధి పొందుతుంటే, నల్గొండ పట్టణ సమీపంలోని ఉదయ సముద్రంపై మాత్రం నేటికీ నిషేధం కొనసాగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ జలాశయంలో చేపల పెంపకానికి అనుమతి ఇస్తే, స్థానిక ముదిరాజ్, బెస్త మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్షంగా ఉపాధి లభించడంతో పాటు, ప్రజలకు నాణ్యమైన చేపలు సరసమైన ధరల్లో లభిస్తాయని వారు స్పష్టం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని ఉదయ సముద్రంపై నిషేధాన్ని తొలగించేలా తక్షణ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిట్టబోయిన రమేష్ ముదిరాజ్, తోటరాజు చాగంటి రాము, బిళ్ళ కంటి కృష్ణ, నీలం గణేష్, లింగంపల్లి నవీన్, ఎలుగు పాండు తదితరులు పాల్గొన్నారు.