రాయల్ పోస్ట్ న్యూస్ న్యూఢిల్లీ, జూలై 29: తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్, బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావుకు జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ప్రతిష్ఠాత్మక ‘జాతీయ విశిష్ట సేవా పురస్కారం’ ప్రదానం చేసింది .న్యూఢిల్లీలోని ఆంధ్రా అసోసియేషన్ భవన్లో మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించిన ‘హస్తినలో తెలుగు వెలుగు’ వేడుకల్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈ పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు.
ప్రజా జీవితం, వెనుకబడిన వర్గాల సంక్షేమం, తెలుగు భాషా–సాహిత్యాభివృద్ధి, సామాజిక రంగాల్లో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అందించిన విశిష్ట సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు, జాతీయ తెలుగు సారస్వత పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రామప్రసాద్, పరిషత్ ప్రతినిధులు ముత్యాల శ్రీనివాస్, డాక్టర్ సుధీర్ రమణ, కాంతేటి వెంకటరాజు, ఆదిలీలా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఎస్. ఆదినారాయణతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సాహితీవేత్తలు, కళాకారులు, సామాజికవేత్తలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పేలా అత్యంత వైభవంగా ఈ వేడుకలు నిర్వహించారు.
