రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జూన్ 29/ రమణేశ్వరంలో జగద్గురు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి 31వ ఆత్మసాక్షాత్కార మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ మహోత్సవంలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించారు.


ఈ సందర్భంగా సిద్ధగురు ధ్యానాన్ని నిర్వహించగా, భక్తులు అత్యంత ఏకాగ్రతతో ధ్యానంలో పాల్గొన్నారు. అనంతరం శ్రీచక్ర మహాలయంలో ప్రత్యేక అభిషేకాలు, బంగారు శివలింగానికి మహాభిషేకం మరియు హవనం నిర్వహించారు. కార్యక్రమం అనంతరం భక్తులందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సిద్ధగురు ప్రసంగిస్తూ ఆత్మదర్శనం యొక్క గొప్పతనాన్ని వివరించారు. 1995 జూన్ 29న మాత పూర్ణానంద యోగిని వారి అనుగ్రహంతో, వారి శక్తిపాతం ద్వారా తనకు ఆత్మదర్శనం కలిగిందని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకసార్లు ఆ దివ్య అనుభూతిని పొందినట్లు పేర్కొన్నారు.
ఆత్మదర్శనం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, జీవభావం వంటి అన్ని పరిమితులను అధిగమించి, ఎలాంటి సంకల్పాలు, వికల్పాలు, భావాలు లేని దివ్య ప్రజ్ఞా స్థితిలో నిలవడమేనని సిద్ధగురు వివరించారు. అలాంటి దివ్య స్థితిని కోట్లలో ఒక్కరు మాత్రమే పొందగలరని చెప్పారు.
కేవలం శాస్త్రాలు, వేదాలు అధ్యయనం చేయడం వల్ల భాషాజ్ఞానం, బుద్ధిజ్ఞానం మాత్రమే లభిస్తాయని, కానీ ఆత్మదర్శనం లభించదని స్పష్టం చేశారు. సద్గురువును ఆశ్రయించి, గురుసేవ చేస్తూ, గురుకృపను పొందినప్పుడే ఆత్మసాక్షాత్కారం సాధ్యమవుతుందని తెలిపారు.
ఈ మహోత్సవంలో పండిత్ గోపదేవ గారి ప్రముఖ శిష్యుడు శ్రీ మసన చెన్నప్ప గారు, అనేక మంది ప్రముఖులు, భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై మహోత్సవాన్ని విజయవంతం చేశారు.
ఆధ్యాత్మికత, గురుభక్తి, ధ్యానసాధన, వైదిక సంప్రదాయాల సమన్వయంగా నిర్వహించబడిన ఈ 31వ ఆత్మసాక్షాత్కార మహోత్సవం భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. పాల్గొన్న భక్తులందరూ సిద్ధగురు ఆశీస్సులు పొంది ఆధ్యాత్మిక ఉత్సాహంతో తమ తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లారు.