రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, ఆగస్టు 23: హైదరాబాద్ లోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన తొలి ప్రపంచ ఓపెన్ తైక్వాండో చాంపియన్‌షిప్ –2026లో తెలంగాణకు చెందిన తైక్వాండో క్రీడాకారుడు, కోచ్ రాథోడ్ రాజు నాయక్ టోర్నమెంట్ గ్రాండ్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు.
పన్నెండు దేశాలు, ఇరవై రెండు రాష్ట్రాల నుంచి సుమారు రెండు వేల మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో నాగర్‌కర్నూల్ జిల్లా తైక్వాండో సంఘం తరఫున బరిలోకి దిగిన రాజు నాయక్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. పోరాట విభాగం, వేగవంతమైన పిడిగుద్దుల విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడంతో పాటు ప్రపంచ రికార్డుల గ్రంథంలో తన పేరును నమోదు చేసుకున్నారు. కాచిగూడ లోని ఎంఎస్ఎస్ లా కళాశాలలో ఫైనల్ ఇయర్ లా చదువుతున్నాడు. ఈ సందర్భంగా ఆదివారం రాజు నాయక్ ను పలువురు అభినందించి సన్మానించారు.
ఈ సందర్భంగా అమికల్ క్రీడా సమాఖ్య వ్యవస్థాపకురాలు వీణా వాహిని, జయరాం అంతర్జాతీయ యుద్ధకళల అకాడమీ గ్రాండ్ మాస్టర్ జయేంద్ర రెడ్డి రాజు నాయక్‌ను గ్రాండ్ చాంపియన్‌షిప్ అవార్డుతో సన్మానించి అభినందించారు. తెలంగాణ క్రీడా వర్గాలు ఆయన విజయంపై హర్షం వ్యక్తం చేశాయి.