అనితా వాంకుడోతు లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి.
రాయల్ పోస్ట్ న్యూస్ జనగాం, ఆగస్టు 23: బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే తీజ్ పండుగ నిమజ్జన కార్యక్రమం జనగాం పట్టణంలో భక్తి, భావోద్వేగం, ఐక్యతల నడుమ ఘనంగా జరిగింది. లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి అనితా వాంకుడోతు ముఖ్య అతిథిగా పాల్గొనీ మాట్లాడారు.
సంత్ శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్, మెరామ యాడి ఆశీస్సులతో తొమ్మిది రోజుల పాటు తీజ్‌ను భక్తిశ్రద్ధలతో పూజించారు. బంజారా మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తులు, ప్రత్యేక ఆభరణాలతో ముస్తాబై తొమ్మిది రోజుల పాటు ఆటపాటలు, భక్తి గీతాలు, సంప్రదాయ నృత్యాలతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న అనితా వాంకుడోతు మాట్లాడుతూ, “తీజ్ పండుగ బంజారాలకు ఒక పండుగ మాత్రమే కాదు.. మన అస్తిత్వానికి ప్రతీక, మన సంస్కృతికి ఊపిరి, మన ఐక్యతకు నిలువెత్తు నిదర్శనం” అని అన్నారు. ప్రకృతిని తల్లిగా భావించి పూజించడం, పూర్వీకుల సంప్రదాయాలను గౌరవించడం బంజారా జీవన విధానంలో అంతర్భాగమని పేర్కొన్నారు.
“కాలం మారినా.. తరాలు మారినా.. మన సంస్కృతి మారకూడదు. మన సంప్రదాయాల జాడలు చెరిగిపోకూడదు. మన పిల్లల గుండెల్లో సేవాలాల్ మహారాజ్ బోధనలు, మెరామ యాడి పట్ల భక్తి, బంజారా సంస్కృతిపై గర్వం చిరస్థాయిగా నిలవాలి” అని ఆమె పిలుపునిచ్చారు.
తొమ్మిది రోజుల భక్తి, ఆటపాటల అనంతరం తీజ్ నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. జనగాం పట్టణంలోని బతుకమ్మ కుంట వద్ద సుమారు 500 మంది బంజారా, గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు, యువతులు చేసిన సామూహిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
డి జే ల మోత, సంప్రదాయ గీతాలు, నృత్యాలతో బతుకమ్మ కుంట పరిసరాలు బంజారా సంస్కృతి వైభవాన్ని చాటాయి. తొమ్మిది రోజుల భక్తి.. వేల భావోద్వేగాలు.. ఒక్కటైన హృదయాలు.. అన్నట్లుగా సాగిన తీజ్ ఉత్సవాల చివరి ఘట్టం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది.
తీజ్‌ను నిమజ్జనం చేస్తున్న సమయంలో భక్తుల కళ్లలో ఆనందం, హృదయాల్లో భక్తి, మనసుల్లో తమ సంస్కృతిపై గర్వం వెల్లివిరిసింది. “మన సంస్కృతిని కాపాడుకుందాం.. మన అస్తిత్వాన్ని నిలబెట్టుకుందాం.. ఐక్యంగా ముందుకు సాగుదాం” అనే సందేశంతో తీజ్ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.
ఈ కార్యక్రమంలో బలునాయక్, భిక్కునాయక్, లాల్మా నాయక్, దేవి, విజయ, మంజుల, రాధ, లలిత తదితరులు పాల్గొన్నారు. సుమారు 500 మంది గిరిజనుల సామూహిక నృత్యాలు, భక్తిశ్రద్ధల మధ్య తీజ్ నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.