ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నదే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం: కేఎల్ఆర్
కొలన్‌గూడలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
(రాయల్ పోస్ట్ న్యూస్ మహేశ్వరం ఆగస్టు 23:)
కందుకూరు: పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు అనేది కేవలం ఒక కల మాత్రమే కాదని, అది వారి ఆత్మగౌరవానికి ప్రతీక అని మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ( కేఎల్ఆర్) అన్నారు.రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం కొలన్‌గూడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన ఇళ్లను కెఎల్ఆర్ ప్రారంభించారు. నూతన గృహాల ప్రారంభోత్సవం సందర్భంగా లబ్ధిదారుల కుటుంబాల్లో నెలకొన్న ఆనందాన్ని చూసి ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒక గొప్ప భరోసాగా నిలుస్తోందని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి సహాయం అందిస్తోందన్నారు.పేదల సొంత ఇంటి కలను నిజం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన ఉద్దేశమని కేఎల్ఆర్ పేర్కొన్నారు. ఇల్లు లేని ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ పథకం ద్వారా న్యాయం జరిగేలా చూడాలని, ఎలాంటి రాజకీయాలు, వివక్షలకు తావులేకుండా నిజమైన అర్హులకు సంక్షేమ పథకాల ఫలాలు అందాలని అన్నారు.“ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు... ఒక కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్తుపై నమ్మకం” అని కెఎల్ఆర్ పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో పెరిగే పిల్లలు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని, ప్రతి కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా మరింత బలపడాలని ఆకాంక్షించారు.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కళ్లలో కనిపిస్తున్న ఆనందమే ఈ పథకం విజయానికి నిదర్శనమని కెఎల్ఆర్ అన్నారు. ప్రతి అర్హ కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేరే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేఎల్ఆర్ కు లబ్ధిదారుల కృతజ్ఞతలు కొలన్‌గూడ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు గోరిబీ, పర్వీన్, మానస, పోచమ్మ, పద్మ తదితరులు తమకు సొంత ఇంటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేఎల్ఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబాలకు సొంత గూడు లభించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, దేవాలయ కమిటీ డైరెక్టర్లు, డివిజన్ నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.