రాయల్ పోస్ట్ న్యూస్ ఆగస్ట్ 16 హైదరాబాద్:/ హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో SIR (Special Summary Revision / స్పెషల్ సమరీ రివిజన్) శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అబ్జర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్, గంప వేణుగోపాల్‌తో పాటు SIR పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌చార్జులు, కోఆర్డినేటర్లు, అబ్జర్వర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన SIR నివేదికను అబ్జర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్.. ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్‌కు అందజేశారు.
అనంతరం మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ, ఈడీ (ED) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీతో చేతులు కలిపి పనిచేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పోరాటం కేవలం బీజేపీతోనే కాకుండా ఎలక్షన్ కమిషన్‌తో కూడా సాగాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయిలో కొత్త ఓట్లను నమోదు చేయించడంతో పాటు ప్రజాస్వామ్యవాదుల ఓట్లను అక్రమంగా తొలగించకుండా నాయకులు, కార్యకర్తలు రెండు విడతలుగా నిశితంగా పరిశీలించాలని సూచించారు.
2029 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆమె కోరారు. అలాగే తెలంగాణలో ప్రజా పాలనను 2029లోనూ మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి క్షేత్రస్థాయిలో శ్రమించాలని పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో గెలవాల్సిన ప్రజా ప్రభుత్వాలను SIR ప్రక్రియ ద్వారా ఓట్లను తొలగించి బీజేపీ ప్రభావితం చేసిందని, ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంపైనా దృష్టి సారించిందని విమర్శించారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నందున, ఒక్క కాంగ్రెస్ ఓటు కూడా జాబితా నుంచి పోకుండా జాగ్రత్త వహించాలని పార్లమెంట్ ఇన్‌చార్జులు, అసెంబ్లీ కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేశారు.