royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaమహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 19 Aug 2026, 2:27 pm
Date of Publish : 16 Aug 2026, 8:49 am  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 4 💬 0
Latest News

మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి

మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి

రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, ఆగస్టు 15: దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అవంతి కళాశాల ప్రిన్సిపల్ నాగరాజు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, దేశభక్తి, సేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.
బర్కత్‌పురలోని అవంతి కళాశాలలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ నాగరాజు జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నాగరాజు మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించడం వెనుక ఎంతోమంది మహనీయుల త్యాగాలు, పోరాటాలు ఉన్నాయని అన్నారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు, దేశభక్తిని అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కళాశాలలో విద్యార్థులకు వివిధ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం తరఫున బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. విజేతలను కళాశాల ప్రిన్సిపల్, యాజమాన్య ప్రతినిధులు అభినందించారు.
కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ (హెచ్‌ఆర్) డాక్టర్ జయప్రద, కార్యదర్శి సాయిరాం, హెచ్‌ఓడీ వేణుగోపాల్‌తో పాటు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ భావాన్ని చాటుతూ విద్యార్థులు ఉత్సాహంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.