.
హైదరాబాద్, ఆగస్టు 08 రాయల్ పోస్ట్ న్యూస్ / తెలంగాణకు చెందిన జాతీయ స్థాయి కరాటే క్రీడాకారుడు, మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని ఆల్వాల్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వి. సుధాకర్ అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ రికార్డు సాధించేందుకు సిద్ధమవుతున్నారు.
జీవీఆర్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో, ప్రముఖ కరాటే గురువు డా. జి.ఎస్. గోపాల్ రెడ్డి పర్యవేక్షణలో, భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రపంచ రికార్డు ప్రయత్నంలో వి. సుధాకర్ పాల్గొననున్నారు.
ఈ రికార్డు ప్రయత్నంలో 9 రకాల కరాటే టెక్నిక్స్‌తో కేవలం 8 నిమిషాల్లో 80 శాబాద్ (రాక్) టైల్స్‌ను విరగగొట్టే సాహసాన్ని ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 9న హైదరాబాద్‌లోని జీవీఆర్ కరాటే అకాడమీలో నిర్వహించబడనుంది.
వి. సుధాకర్ 2013లో జీవీఆర్ కరాటే అకాడమీలో చేరి కరాటేలో శిక్షణ పొందుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచారు. ఆల్ ఇండియా ప్రిజన్స్ డ్యూటీ మీట్లో జాతీయ స్థాయిలో కాంస్య పతకం సాధించడంతో పాటు, పలు రాష్ట్ర, జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌లలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలను కైవసం చేసుకుని తన ప్రతిభను చాటుకున్నారు.
ప్రస్తుతం ఆల్వాల్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా ప్రజాసేవ అందిస్తూనే, క్రీడా రంగంలోనూ నిరంతర సాధన కొనసాగిస్తున్న వి. సుధాకర్ ప్రపంచ రికార్డు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి మరింత గౌరవం తీసుకురావాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్నారు.
ఈ సందర్భంగా జీవీఆర్ కరాటే అకాడమీ వ్యవస్థాపకులు, ప్రధాన శిక్షకులు డా. జి.ఎస్. గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, వి. సుధాకర్ క్రమశిక్షణ, అంకితభావం, కఠోర సాధనకు ప్రతీక అని, ప్రపంచ రికార్డు ప్రయత్నంలో విజయవంతమై తెలంగాణకు, దేశానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.