ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విద్యుత్ లైన్ ఏర్పాటుకు అంగీకరించిన స్కూల్ కరస్పాండెంట్ జోడా
రాయల్ పోస్ట్ న్యూస్ ఆగస్ట్ 3/ భువనగిరి: భువనగిరి పట్టణ ప్రజల భద్రత, సంక్షేమమే ధ్యేయంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరో కీలక ముందడుగు వేశారు. పట్టణంలో రోజూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న 33 కేవీ విద్యుత్ లైన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
ఈ మేరకు సోమవారం తన నివాసంలో ఇండియా మిషన్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీ జోడాను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి, సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత 33 కేవీ విద్యుత్ లైన్ ఏర్పాటుపై కరస్పాండెంట్‌తో ఎమ్మెల్యే సవివరంగా చర్చించారు.
పట్టణంలోని పలు వార్డుల్లో విద్యుత్ లైన్లు ఇళ్ల పైకప్పుల మీదుగా వెళ్లడం వల్ల స్థానిక ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు, ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే వివరించారు. ప్రతిపాదిత నూతన మార్గంలో విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తే ప్రజల భద్రత పెరగడంతో పాటు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. అలాగే ఈ మార్గం ద్వారా విద్యుత్ లైన్లు తీసుకెళ్లడం వల్ల పాఠశాల ప్రాంగణానికి, విద్యార్థులకు ఎలాంటి ముప్పు లేదా ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి విజ్ఞప్తికి ఇండియా మిషన్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీ జోడా సానుకూలంగా స్పందించారు. ప్రజల సంక్షేమాన్ని, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత 33 కేవీ విద్యుత్ లైన్ పనులకు తన సంపూర్ణ అంగీకారాన్ని తెలియజేశారు. ప్రజా ప్రయోజనాల కోసం స్వచ్ఛందంగా సహకరించిన శ్రీ జోడాను ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో 31వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి సుమయ్య తబస్సుం షఫీక్ అహ్మద్, 30వ వార్డు కౌన్సిలర్ శ్రీ లయీక్ అహ్మద్, జిల్లా కాంగ్రెస్ నాయకులు అతార్, క్యామీ తదితరులు పాల్గొన్నారు.