రాయల్ పోస్ట్ న్యూస్ గుండాల ఆగస్ట్ 3/ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు..ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని వైద్యాధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న చికిత్స, మందుల లభ్యత, అత్యవసర వైద్య సేవలు, ఆసుపత్రిలో ఉన్న వసతులపై సమగ్రంగా ఆరా తీశారు.ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందుల నిల్వలు, వాటి కాలపరిమితి, అవసరమైన అన్ని రకాల మందులు సరిపడా ఉన్నాయా లేదా అనే అంశాలను స్వయంగా పరిశీలించారు. అలాగే కొరత ఉన్న వైద్య, పారామెడికల్ సిబ్బంది వివరాలను సేకరించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అదేవిధంగా 108 అంబులెన్స్ సేవల పనితీరు, అత్యవసర పరిస్థితుల్లో స్పందన సమయం, ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అంబులెన్స్ సేవలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో)తో ఫోన్‌లో మాట్లాడిన బీర్ల అయిలయ్య గారు, ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది కొరత, మందుల లభ్యత, గడువు ముగిసే మందుల పరిస్థితి, 108 అంబులెన్స్ సేవలు తదితర అంశాలపై పూర్తి నివేదికను వెంటనే అందజేయాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని స్పష్టం చేశారు.ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని బీర్ల అయిలయ్య గారు పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో చికిత్స అందేలా అధికారులు, వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.