బి ఆర్ ఎం జి ఎస్ ఎస్ జాతీయ ఇన్చార్జి మనోరంజన్ కుమార్ పాశ్వన్
రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, ఆగస్టు 02: భారతీయ రైల్వే మాల్ గోదాం కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే తమ సంఘం ప్రధాన లక్ష్యమని భారతీయ రైల్వే మాల్ గోదాం శ్రామిక్ సంఘ్ (బి ఆర్ ఎం జి ఎస్ ఎస్) జాతీయ ఇన్చార్జి మనోరంజన్ కుమార్ పశ్వన్ అన్నారు. మాల్ గోదాం కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు లేదా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందని, ఈ లక్ష్యం త్వరలోనే నెరవేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం బి ఆర్ ఎం జి ఎస్ ఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలపై మాల్ గోదాం కార్మికులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 1998 నుంచి మాల్ గోదాం కార్మికుల హక్కుల సాధన కోసం సంఘం నిరంతరం పోరాటం చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో పలు త్రైపాక్షిక సమావేశాలు నిర్వహించిందని తెలిపారు. ఈ క్రమంలో కార్మిక చట్టాల్లో పలు సవరణలు జరిగి, మాల్ గోదాం కార్మికులకు సంక్షేమ ప్రయోజనాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. 2024 అక్టోబర్ 9న కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్, రైల్వే, కార్మిక శాఖల అధికారులు, సంఘం ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మాల్ గోదాం కార్మికుల కోసం ప్రత్యేక లేబర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దేశవ్యాప్తంగా మాల్ గోదాంలలో భౌతిక ధృవీకరణ చేపట్టిందన్నారు. ఈ ప్రక్రియలో కార్మికులు, సరుకు రవాణాదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, దోపిడీ, మౌలిక వసతుల లోపాలు ప్రభుత్వ దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. కార్మికులకు పీస్రేట్ కూలీని మధ్యవర్తులు లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విధి నిర్వహణలో ప్రమాదాలు జరిగినా, కార్మికుల హక్కులకు భంగం కలిగినా సంఘం అండగా ఉంటుందని, అవసరమైతే ఉద్యమాలకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. కార్మికులు తమ హక్కులపై పూర్తి అవగాహన పెంచుకుని ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ అధ్యక్షుడు రణవీర్ సింగ్, ఆర్గనైజేషన్ మంత్రి ప్రతీక్ రాథోర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. అశోక్, ఉపాధ్యక్షుడు బి. మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.