గజ్వేల్, 26 జూలై 2026 రాయల్ పోస్ట్ న్యూస్ /
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 14, 15వ వార్డుల్లో గత కొన్ని రోజులుగా పందుల సంచారం విపరీతంగా పెరిగిపోయి, స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. వార్డుల్లో పదుల సంఖ్యలో పందులు స్వేచ్ఛగా తిరుగుతుండటంతో అపరిశుభ్రత పెరిగిపోవడమే కాకుండా, రాత్రి సమయంలో రోడ్లపై వెళ్లే వాహనదారులకు, స్థానికులకు ప్రమాదకరంగా పరిణమించాయి. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పందుల పెంపకాన్ని ఊరి చివర లేదా జనావాసాలకు దూరంగా ఉండే ప్రాంతాలలో మాత్రమే చేపడతారు. కానీ, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లాంటి మున్సిపాలిటీలో మాత్రం నివాస గృహాలు ఉన్న వార్డుల్లోనే పందులు సంచరిస్తుండటం విడ్డూరంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందనే భయం ప్రజలను వెంటాడుతోంది. గతంలో కూడా ఈ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, కొద్ది రోజులు మాత్రమే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి, ఆ తర్వాత మళ్లీ పట్టించుకోవడం లేదని వార్డు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి, నివాస ప్రాంతాల్లో తిరుగుతున్న పందులను వెంటనే మున్సిపల్ పరిధి దాటించి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని 14, 15వ వార్డుల ప్రజలు కోరుతున్నారు.