royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaఇంజక్షన్ ఉత్తర్వులు ఉన్నా కాంపౌండ్ వాల్ నిర్మాణం జీహెచ్‌ఎంసీ, పోలీసులకు… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 26 Jul 2026, 12:47 pm
Date of Publish : 20 Jul 2026, 8:24 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 25 💬 0
Latest News > తెలంగాణ > హైదరాబాద్

ఇంజక్షన్ ఉత్తర్వులు ఉన్నా కాంపౌండ్ వాల్ నిర్మాణం జీహెచ్‌ఎంసీ, పోలీసులకు ఫిర్యాదు

ఇంజక్షన్ ఉత్తర్వులు ఉన్నా కాంపౌండ్ వాల్ నిర్మాణం జీహెచ్‌ఎంసీ, పోలీసులకు ఫిర్యాదు

రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్, జూలై 20: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగిలో సివిల్ వివాదంలో ఉన్న భూమిలో, కోర్టు మధ్యంతర (Ad-interim) ఇంజంక్షన్ ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపడుతున్నారని ఆరోపిస్తూ వాది పల్లపోతు సుబ్రమణ్యేశ్వర్ జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
సుబ్రమణ్యేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం, O.S. No.187/2026లో I.A. No.466/2026పై సంగారెడ్డి అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు 24-06-2026న మధ్యంతర ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు ప్రస్తుతం అమల్లో ఉన్నప్పటికీ, సంబంధిత వ్యక్తులు ఎలాంటి చట్టబద్ధమైన భవన లేదా కాంపౌండ్ వాల్ నిర్మాణ అనుమతులు లేకుండానే పనులు కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ తెల్లాపూర్ సర్కిల్ జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌తో పాటు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సంబంధిత భూమి వాస్తవానికి పట్టాదారు మల్లయ్యకు చెందినదని, అనంతరం ఆయన వారసుల నుంచి తమ కుటుంబం రిజిస్టర్డ్ అమ్మకపు దస్తావేజు ద్వారా కొనుగోలు చేసిందని సుబ్రమణ్యేశ్వర్ పేర్కొన్నారు. అయితే, మల్లయ్య జీవించి ఉన్న సమయంలోనే చెల్లని పత్రాలు, ఫోర్జరీ సంతకాలను ఆధారంగా చేసుకుని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తమ భూమిపై హక్కులు చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ అంశంపై సివిల్ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా, తమ స్వాధీనాన్ని పరిరక్షిస్తూ కోర్టు మధ్యంతర ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. అదేవిధంగా, జీపీఆర్ లేఅవుట్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ మొత్తం వ్యవహారానికి ప్రధాన కారణమని సుబ్రమణ్యేశ్వర్ ఆరోపించారు. తమ వ్యవసాయ భూమిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో, దానిని తన లేఅవుట్‌లోని ప్లాట్లలో భాగంగా చిత్రీకరిస్తూ ముందస్తు ప్రణాళికతో ఈ చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కోర్టు వివాదంలో ఉన్న భూమిని లేఅవుట్‌లో భాగంగా చూపిస్తూ తమ యాజమాన్య హక్కులను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా నిర్మాణం కొనసాగించడం వల్ల వివాదం మరింత తీవ్రమై శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్మాణ అనుమతులను పరిశీలించి, అనుమతులు లేకుండా నిర్మాణం జరుగుతున్నట్లు తేలితే వెంటనే పనులను నిలిపివేయాలని, అలాగే శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు చట్టప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. న్యాయస్థానం ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరారు.