గజ్వేల్, 19 జూలై 2026 రాయల్ పోస్ట్ న్యూస్ /
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో చదరంగం క్రీడలు ఆదివారం అత్యంత ఘనంగా జరిగాయి. స్వామి వివేకానంద సేవాసమితి - గజ్వేల్, రాచకొండ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ - గజ్వేల్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ - గజ్వేల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కల్యాణ్ కార్ పద్మాబాయి నర్సింగరావు, 20వ వార్డు కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్, 14వ వార్డు కౌన్సిలర్ గుంటుకు లక్ష్మి శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.సి. సంతోష్ హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కల్యాణ్ కార్ పద్మాబాయి నర్సింగరావు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్లకే పరిమితమై, వాటికి ఆకర్షితులవుతున్నారన్నారు. ఇలాంటి తరుణంలో విద్యార్థుల్లో దాగున్న ప్రతిభను వెలికితీయడానికి, వారి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. ముఖ్యంగా చదరంగం లాంటి ఆటలు మేధోశక్తిని పెంచుతాయన్నారు. సమాజానికి మేలు జరిగే ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు. అనంతరం క్రీడా పోటీల నిర్వాహకులు ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను బహూకరించారు. ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, క్రీడాభిమానులు, నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.