royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telanganaవిద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా..? స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి:… › e-Paper Clip royalpost.co.in Latest Telugu News Today | Breaking News in Andhra & Telangana
Share: f 𝕏 in @
royalpost.co.in 13 Sep 2026, 7:53 pm
Date of Publish : 18 Jul 2026, 6:04 pm  |  Posted by : FASIUDDIN MOHAMMED
👁 25 💬 0
Latest News > తెలంగాణ > యాదాద్రి భువనగిరి

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా..? స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి: బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు ఢిల్లీ మాధవరెడ్డి

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా..? స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి: బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు ఢిల్లీ మాధవరెడ్డి

రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 18/ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడుతోందని బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఢిల్లీ మాధవరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, నర్సింగ్ తదితర కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు పై చదువులు, ఉద్యోగాలు, పోటీ పరీక్షల కోసం అవసరమైన టీసీలు, మెమోలు, ఒరిజినల్ సర్టిఫికెట్ల కోసం కళాశాలలకు వెళ్తే, ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రాకపోవడంతో కళాశాల యాజమాన్యాలు ముందుగా ఫీజులు చెల్లించాలని కోరుతున్నారు ఢిల్లీ మాధవరెడ్డి తెలిపారు. ప్రభుత్వ వైఫల్యానికి విద్యార్థులను బలిచేయడం దారుణమన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రూ.11 వేల కోట్లకు పైగా స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో విద్యాసంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని, అధ్యాపకులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని, కొన్ని కళాశాలలు మూతపడే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని విమర్శించిన మాధవరెడ్డి, విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, ప్రతి విద్యార్థికి ఎలాంటి ఆటంకం లేకుండా సర్టిఫికెట్లు అందేలా ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే బీఆర్ఎస్ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఢిల్లీ మాధవరెడ్డి హెచ్చరించారు.