రాయల్ పోస్ట్ న్యూస్ హైదరాబాద్ , జూలై 14: గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న శ్రీ జగన్నాథ స్వామి రథ యాత్ర జులై 16న అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని ఇస్కాన్, కుకుట్ పల్లి అధ్యక్షులు శ్రీ మహాశృంఘ దాస, శ్రీ జగన్నాథ స్వామి రథ యాత్ర 2026 నిర్వహణ కమిటీ చైర్మన్ అంజనీ కుమార్ అగర్వాల్ లు ప్రకటించారు. హైదరాబాద్, బషీర్ బాగ్, దేశోద్ధారక భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు శ్రీ జగన్నాథ స్వామి రథ యాత్ర గోడ పత్రికను ఆవిష్కరించి మాట్లాడుతూ శ్రీ జగన్నాథ స్వామి రథ యాత్ర వైదిక సంప్రదాయంలో అత్యంత ప్రాచీనమైన, పవిత్రమైన ఉత్సవాలలో ఒకటని, వెలది సంవత్సరాలుగా నిరంతరంగా జరుపుకుంటున్న ఈ రథయాత్ర ప్రపంచ వ్యాప్తంగా 1500 పైగా ఇస్కాన్ దేవాలయాలు మరియు కేంద్రాలు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహిస్తూ భక్తి, ఐక్యత, ఆధ్యాత్మిక ఆనందం అనే శాశ్వత సందేశాన్ని కోట్లాది ప్రజలకు చేరవేస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్, కుకుట్ పల్లి లో జులై 16న శ్రీ జగన్నాథ స్వామి రథ యాత్రను తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మంగళకరమైన ప్రారంభ పూజ నిర్వహించి, ఈ మహా రథయాత్రను జండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. జగన్నాథ స్వామి, బలభద్రుడు మరియు సుభద్రా దేవిలను అద్భుతంగా అలంకరించిన రథంపై ఊరేగింపుగా తీసుకెళ్తారని, భక్తుల హరినామ సంకీర్తనలు, భక్తి నృత్యాలు, హరిహర నామజపంతో ఉత్సాహభరితమైన వాతావరణంలో ఈ యాత్ర మధ్యాహ్నం 3.02 నిమిషములకు హైదర్ నగర్, పోచమ్మ, మైసమ్మ ఆలయాలనుండి ప్రారంభమై, రాత్రి 8.00 గంటలకు కుకుట్ పల్లి, హుడా ట్రక్ పార్కింగ్ ప్రాంగణానికి చేరుకుంటుందని అనంతరం మహా ప్రసాద విందు ఏర్పాటు చేయడమైందని చెప్పారు. ప్రధాన ఆకర్షణగా నిలిచే ఈ రథాన్ని లాగడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని, రథాన్ని లాగడం వల్ల దైవానికి దగ్గరవుతామని మరియు దైవానుగ్రహం పొందుతామని భక్తులు విశ్వసిస్తారని, కులం, మతం, వర్ణం, ప్రాంతం అనే భేదభావాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి భగవంతుని కరుణ, దయ మరియు ఆశీర్వాదాలు అందించాలనే సంకల్పంతో నిర్వహించే ఈ రథయాత్రలో లక్షల సంఖ్యలలో భక్తులు పాల్గొంటారని తెలిపారు. వ్యక్తులు, కుటుంబాలు, సేవ సంస్థలు మహా ప్రసాద పంపిణి సేవలో పాల్గొని వేలాదిమంది భక్తులకు జగన్నాథ స్వామి కృపను అందించే ఈ దివ్య సేవలో భాగస్వాములు కావాలని శ్రీ మహాశృంఘ దాస, అంజనీ కుమార్ అగర్వాల్ విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశంలో ఇస్కాన్ ప్రతినిధులు రంగదేవి, లహరి, అచ్యుత్ ప్రభు, ప్రద్యుమ్న ప్రభు తదితరులు పాల్గొన్నారు.