గజ్వేల్ నియోజకవర్గం, 12 జూలై 2026 రాయల్ పోస్ట్ న్యూస్ /
భారత ఎన్నికల సంఘం ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ సిద్దిపేట జిల్లా, ములుగు మండలం, మామిడ్యాల గ్రామంలో విజయవంతంగా కొనసాగుతోందని గ్రామ సర్పంచ్ ఎడ్ల పోచయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎడ్ల పోచయ్య మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఆవరణలో ఓటర్ల సౌకర్యార్థం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో హెల్ప్ డెస్క్ నిరంతరం అందుబాటులో ఉంటుందన్నారు. ఓటర్లకు ఎలాంటి సమస్యలు ఉన్నా, సందేహాలు వచ్చినా పరిష్కరించడానికి బూత్ లెవెల్ అధికారులు కేంద్రంలో అందుబాటులో ఉంటారన్నారు. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నా, మార్పులు చేర్పులు ఉన్నా సంబంధిత అప్లికేషన్ ఫారాలను నింపి నేరుగా బూత్ లెవెల్ అధికారులకు సమర్పించాలనన్నారు. గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియ జరుగుతోంది. ప్రజలు ఈ హెల్ప్ డెస్క్‌ను ఉపయోగించుకుని తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కృష్ణ, కార్యదర్శి రాజు, సీనియర్ నాయకులు, వార్డు సభ్యులు అనిల్ చారి, బి.ఎల్.వో. లు విజయ, నాగరాణి గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.