రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి జులై 10/రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడేందుకు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన దళిత, గిరిజన, మైనారిటీ సామాజిక వర్గాలకు పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదని బర్రె జహంగీర్ భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కు ఆయన బహిరంగ విజ్ఞప్తి చేశారు.
ఇటీవల యాదాద్రి–భువనగిరి జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రకటించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) చైర్మన్ పదవుల్లో ఒక్క దళితుడు కూడా అవకాశం కల్పించకపోవడం, యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం ధర్మకర్తలలో స్థానిక దళితులకు అవకాశం ఇవ్వకపోవడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన దళితులకు ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లోనూ, పార్టీ పదవుల్లోనూ తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి దళిత సామాజిక వర్గం వెన్నెముకగా నిలిచినా, అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సరైన గుర్తింపు, అవకాశాలు లభించడం లేదని బర్రె జహంగీర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో రాజ్యాంగ రిజర్వేషన్లు ఉన్న స్థానాలు మినహా సాధారణ స్థానాల్లో పోటీ చేసే అర్హత, సామర్థ్యం ఉన్న దళిత నాయకుల ఆర్థిక పరిస్థితులు, ఇతర కారణాలు చూపుతూ పక్కన పెట్టడం సరికాదన్నారు.
ఇప్పటికే మండల కాంగ్రెస్ కమిటీ, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాల్లో కూడా దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందనే చర్చ జరుగుతోందని, ఇప్పుడు PACS చైర్మన్ పదవుల్లోనూ అదే పరిస్థితి పునరావృతం కావడంతో దళిత సామాజిక వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. ఇలాంటి నిర్ణయాలు కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న దళిత వర్గాలు క్రమంగా దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో దళితులు, గిరిజనులు, మైనారిటీలకు వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రాతినిధ్యం కల్పించే విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాకపోతే, కనీసం పార్టీ పరంగానైనా స్పష్టమైన రిజర్వేషన్ విధానం రూపొందించి సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కోరారు.
కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందనే నమ్మకాన్ని నిలబెట్టాలంటే మాటల్లో కాదు, పదవుల పంపకాల్లో కూడా దళితులకు సముచిత భాగస్వామ్యం కల్పించాలని బర్రె జహంగీర్ విజ్ఞప్తి చేశారు.