గజ్వేల్ నియోజకవర్గం, రాయల్ పోస్ట్ న్యూస్ 07 జూలై 2026 :
సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం రైతులకు 100 శాతం రాయితీపై పత్తి విత్తనాలు మరియు కందుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కొండపాక మండల మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, రైతులకు విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రైతులకు నిజమైన మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. రైతాంగాన్ని ఆదుకోవడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే రైతులకు పూర్తి ఉచితంగా నాణ్యమైన పత్తి, కంది విత్తనాలను అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రభుత్వం అందిస్తున్న సాయంతో అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో కూడా రైతుల సంక్షేమం కోసం మరిన్ని పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు ఈవో, ఏడి, మార్కెట్ కమిటీ డైరెక్టర్, పిఎసిఎస్ డైరెక్టర్, సర్పంచ్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.