గజ్వేల్, 25 జూన్ 2026 రాయల్ పోస్ట్ న్యూస్ తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితమ్మ పిలుపు మేరకు జూలై 2వ తేదీన హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో నిర్వహించబోయే "ఉద్యమకారుల భూ పోరాట" బహిరంగ సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి, ఉమ్మడి మెదక్ జిల్లా కోఆర్డినేటర్ భవాని వేముల, శివశంకర్ ప్రజాపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పుష్కర కాలం అవుతున్నా, గత ప్రభుత్వం గానీ, ప్రస్తుత ప్రభుత్వం గానీ ఉద్యమకారులను మోసపూరిత హామీలతో మభ్యపెడుతూనే ఉన్నాయని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తిన ఎగిసిన కెరటంలా నిలిచిన కవితమ్మకు ఉద్యమకారుల గోస, బాధలు పూర్తిగా తెలుసన్నారు. అందుకే తెలంగాణ రక్షణ సేన పార్టీ ప్రకటించిన రోజునే.. మొదటి అంశంగా ఉద్యమకారులకు న్యాయం చేస్తామని అక్క గర్వంగా ప్రకటించారని గుర్తుచేశారు. ఆ మొదటి ధ్యేయ సాధన కోసమే ఈ రోజు భూ పోరాటానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల భూమి దక్కి తీరాలని, సీనియర్ సిటిజన్లయిన ఉద్యమకారులకు నెలకు రూ. 25,000 పెన్షన్ అందించాలని, అమరవీరుల కుటుంబాలకు రూ. 1 కోటి ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు, వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలతో గద్దెనెక్కిందని, కనీసం తెలంగాణ ఉద్యమకారులకు ఐడీ కార్డులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందని వారు విమర్శించారు. 'కేకే కమిటీ' పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యమకారులను మోసం చేస్తున్నారని, అందుకే తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితమ్మ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సంజీవరెడ్డి, కవిత, ఎడ్ల నర్సింలు మాజీ ఎంపీటీసీ, నాయకులు నరేందర్ రెడ్డి, రాజు, చందు, ప్రసాద్, నర్సింలు, నరేష్, హరి, తదితరులు పాల్గొన్నారు.