రాయల్ పోస్ట్ న్యూస్ గజ్వేల్ నియోజకవర్గం, 24 జూన్ 2026 /:ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల నర్సింహులు అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి ప్రాథమిక పాఠశాలలో అధ్యాపక బృందం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా చిన్నారులకు అక్షరాభ్యాస మహోత్సవం నిర్వహించారు. సారధి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్తా ఆధ్వర్యంలో చిన్నారులకు పలకలు, బలపాలు, బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల నర్సింలు, గ్రామ సర్పంచ్ ర్యాకం యాదగిరి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల నిర్వహిస్తున్న చేబర్తి ప్రాథమిక పాఠశాల అధ్యాపక బృందాన్ని అభినందించారు. విద్య ద్వారానే అన్ని సాధ్యమవుతాయని, విద్యార్థినీ విద్యార్థులు చక్కగా విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దడం మా బాధ్యత అని, పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం, దాతల సహకారం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ శ్రీకాంత్, వార్డు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింలు, హై స్కూల్ హెచ్ఎం శంకర్ రెడ్డి ,ఏఏపిఎస్ చైర్మన్ అఖిల, టీచర్ శ్రీధర్, కమలాకర్ రెడ్డి, ఉమారాణి, జ్యోతి, రాణి, విద్యార్థినీ విద్యార్థులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.